శేరిలింగంపల్లి, మార్చి 12: పోలీసు అవతారమెత్తి.. మసాజ్ సెంటర్ల నిర్వాహకుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గుడి మల్కాపూర్‌కు చెందిన మరికొండ సాయికిరణ్ తేజ (30) సులభంగా డబ్బు సంపాదించేందుకు పోలీసు అవతారమెత్తాడు. క్రైమ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పేరిట నకిలీ ఐడీ కార్డు తయారు చేసుకున్నాడు. ఆ కార్డు చూపించి.. తాను పోలీసునంటూ మసాజ్ సెంటర్ల నిర్వాహకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. హైటెక్ సిటీ పరిధిలో గత కొన్ని రోజులుగా ఈ తరహా ఘటనలు వెలుగు చూడగా..
మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు నిఘా పెట్టారు. రాయదుర్గం ఫార్చున్ అపార్ట్మెంట్ 5వ ఫ్లోర్లో ఉన్న స్టార్ వెల్నెస్ అండ్ ఫ్యామిలీ సెలూన్‌కు సోమ, మంగళవారాల్లో వచ్చిన సాయికిరణ్ తేజ.. తాను పోలీసునంటూ యజమానిని బెదిరించాడు. రూ.10 వేలు వసూలు చేస్తుండగా మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితుడి నుంచి రూ.10 వేల నగదు, ఓ ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. సాయికిరణ్‌పై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు.. అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.