Check Mate | బంజారాహిల్స్, నవంబర్ 4: మెడికల్ సీట్లు.. ఇంజినీరింగ్ సీట్లు.. బ్యాక్‌డోర్ ఉద్యోగాలు.. యూనివర్సిటీలో సీట్లు.. అంటూ అనేక మందిని నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన ‘చెక్‌మేట్’ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంస్థ అధినేత పావుల్ల రోహిత్ అలియాస్ చిన్నూ ముఠా వ్యవహారంలో పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. శ్రీనగర్‌కాలనీలో కొన్ని నెలలు కిందట సనత్‌నగర్ బీకేగూడ ప్రాంతానికి చెందిన రోహిత్ అలియాస్ చిన్నూ చెక్‌మేట్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. అతడి అనుచరులుగా భవానీశంకర్, దినేశ్ అలియాస్ బిట్టూ, నదీముద్దీన్ సయీద్, కామేశ్, అచ్యుత్ తదితరులు పని చేశారు.
వీరంతా తమ వద్ద నుంచి మెడికల్, ఇంజినీరింగ్ సీట్ల కోసం లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేశారంటూ బాధితులు గత నెల 24న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరితో పాటు ఆఫీసు ఏర్పాటు కోసం డబ్బు అవసరం ఉందంటూ స్థానికంగా ఉంటున్న మహిళలను నమ్మించి బురిడీ కొట్టించడంతో రావి గౌతమి అనే మహిళ సైతం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వేర్వేరుగా నాలుగు కేసులు నమోదు చేశారు.
ఈ కేసు దర్యాప్తు చేపట్టిన జూబ్లీహిల్స్ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. గతంలో కూడా ఇదే తరహాలో రోహిత్ ముఠా పలు మోసాలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇదిలా ఉండగా.. ఈ కేసులో రోహిత్‌తో పాటు కీలకపాత్ర పోషించిన భవానీశంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడికి చెందిన కాల్‌డేటా, బ్యాంకు ఖాతా వివరాలను సేకరించారు. గతంలో వెంగళరావునగర్‌లో కూడా చెక్‌మేట్ కన్సల్టెన్సీ సంస్థను పెట్టి పెద్ద సంఖ్యలో బాధితులను మోసం చేసినట్టు తెలిసింది. కేసులు నమోదైన విషయాన్ని తెలుసుకున్న ప్రధాన నిందితుడు రోహిత్‌తో పాటు దినేశ్, నదీముద్దీన్, కామేశ్, అచ్యుత్, ప్రవీణ్ తదితరులు పారిపోగా.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రోహిత్ ముఠా చేతిలో కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలతో పాటు అనేక ప్రాంతాలకు చెందిన బాధితులు సుమారు రూ.10 కోట్లకు పైగానే మోసపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా సభ్యులు గతంలో కూడా పలు ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. దుబాయ్ నుంచి బంగారు బిస్కెట్లు వచ్చాయని నమ్మించి కొంతమంది నుంచి డబ్బులు వసూలు చేశారని, ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే రౌడీల సాయంతో బెదిరిస్తారని సోమవారం పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ముఠా వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేపడితే అనేక మోసాలు బయటపడతాయని పోలీసులు పేర్కొన్నారు.