Kamineni Hospital | మన్సూరాబాద్, ఫిబ్రవరి 1: కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చేవారికి రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందించాల్సింది పోయి బొద్దింకలు వచ్చేలా అశుభ్రంగా క్యాంటీన్ నిర్వహిస్తున్నారు ఎల్బీనగర్ కామినేని దవాఖాన సిబ్బంది. ఇదేమిటని ప్రశ్నిస్తే.. ‘మీ ఇంట్లో బొద్దింకలు ఉండవా? ఇక్కడ కూడా అన్నంలో వస్తుంటాయ్’ అని దురుసు సమాధానం ఇస్తున్నారు. ఈ సంఘటన ఎల్బీనగర్లోని కామినేని దవాఖాన క్యాంటీన్లో శనివారం చోటు చేసుకున్నది. బాధితుడు షఫీక్ తెలిపిన వివరాల ప్రకారం.. షఫీక్ తన సతీమణితో కలిసి శనివారం ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం ఎల్బీనగర్లోని కామినేని దవాఖానకు వచ్చాడు. పరీక్షల అనంతరం మధ్యాహ్నం మరోసారి రావాలని తెలిపారు. దీంతో షఫీక్ కుటుంబసభ్యులతో కలిసి కామినేని దవాఖానలోని క్యాంటీన్‌కు వెళ్లి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాడు. ఫ్రైడ్ రైస్ తింటుండగా అందులో బొద్దింక కనిపించింది.
కంగారుపడ్డ అతడు క్యాంటీన్ సిబ్బందిని ప్రశ్నించగా.. మీ ఇంట్లో కూడ బొద్దింకలు ఉంటాయి కదా.. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఇంత పెద్ద కార్పొరేట్ ఆస్పత్రిలో రోగులకు, వారితో వచ్చే వారికి ఇచ్చే ఆహారంలో నాణ్యత లేని ఫుడ్ అందజేయడమే కాకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన క్యాంటీన్ నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హోటళ్లలోనే కాకుండా ఆస్పత్రుల్లో నిర్వహించే క్యాంటీన్లను కూడా తనిఖీలు చేసే విధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చొరవ చూపాలన్నారు. ఈ విషయంపై ఎల్బీనగర్ కామినేని దవాఖాన యాజమాన్యాన్ని వివరణ కోరగా.. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూస్తామన్నారు. ఆహారంలో బొద్దింక రావడంపై విచారణ చేపట్టి క్యాంటీన్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎల్బీనగర్ కామినేని దవాఖానలోని క్యాంటీన్లో హైజీనిక్‌తో ఫుడ్‌ను అందిస్తున్నామని ఇలాంటి సంఘటన దురదృష్టకరమన్నారు.