ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 20: ప్రస్తుత ఆధునిక యుగంలో అందుబాటులోకి వస్తున్న నూతన సాంకేతికత విధానాలను విద్యార్థులు నేర్చుకోవాలని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్‌కుమార్ నందికూరి సూచించారు. అప్పుడే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ జువాలజీ విభాగం శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా ‘రీసెంట్ ట్రెండ్స్ ఇన్ జువాలజీ – ఇన్నోవేషన్స్ చాలెంజెస్ అండ్ అపార్చునిటీస్’ అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. సైన్స్ కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నిర్వహించిన ఈ సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా డాక్టర్ వినయ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పరిశోధనలవైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. జీనోమిక్స్ రంగంలో విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. టీబీ వ్యాధిలో డ్రగ్ రెసిస్టెన్స్‌పై తన పరిశోధనా అనుభవాన్ని విద్యార్థులకు వివరించారు.
రోగుల్లో యాంటిబయోటిక్స్ నిరోధకతకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. దానిపై సవివరమైన అధ్యయనాలు ఇప్పటికీ ఎన్నో జరిగాయని, మరెన్నో జరగాల్సిన అవసరం ఉన్నదన్నారు. అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రొఫెసర్ సి. విజయసారథి మాట్లాడుతూ.. డీఎన్ఏ మరమ్మతులు, వ్యాధులు సంక్రమించేందుకు కారణాలు, పరిష్కారాలపై తన అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ, జువాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ ఎం.మాధవి, జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, బీవోఎస్ చైర్మన్ ప్రొఫెసర్ జితేందర్ నాయక్, కో జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు ప్రొఫెసర్ ఏవీ. రాజశేఖర్, ప్రొఫెసర్ సి. శ్రీనివాసులు, డాక్టర్ ఎస్. పద్మజ, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ కరుణాసాగర్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.