Dasoju Sravan | తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఇష్టానుసారంగా హైదరాబాద్ కార్పొరేషన్‌ను డీలిమిటేషన్ చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి గుత్తేదారులా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎవరితో చర్చించకుండా వార్డుల పునర్విభన చేశారని విమర్శించారు. తెలంగాణను సర్వనాశనం చేయడానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడని పేర్కొన్నారు. జై సంవిధాన్ అంటూ రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతున్నాడని విమర్శించారు.
సికింద్రాబాద్‌లోని బాలం రాయిలీ ప్యాలెస్‌లో లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భౌగోళిక సమానత్వం కొనసాగిస్తూ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో ఈ వార్డులు పునర్విభజించారని తెలిపారు. మేయర్, కమిషనర్, నేతలు, కార్పొరేటర్లు, అధికారులకు ఏ మాత్రం సమాచారం లేకుండా డీలిమిటేషన్ జరిగిందని అన్నారు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక కూడా బయటపెట్టలేదని అన్నారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి గొప్ప నాయకుడు మనతో ఉన్నారని దాసోజు శ్రవణ్ అన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న సాంస్కృతిక విధ్వంసాన్ని తిప్పికొడదామని పిలుపునిచ్చారు. ఔరంగజేబుకే సాధ్యం కానిది.. రేవంత్ రెడ్డికి సాధ్యమవుతుందా అని వ్యా్ఖ్యానించారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ చరిత్రను చెరిపివేయడం మానుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి హితవు పలికారు.