Revanth Reddy | నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డిపై భారతీయ జనతాపార్టీ ప్రధాన కార్యదర్శి కాసం వేంకటేశ్వర్లు దాఖలు చేసిన పరువునష్టం క్రిమినల్ కేసును బుధవారం ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ చేపట్టింది. సీఎం కోర్టుకు గైర్హాజరు కావడంతో ఆయన తరఫు న్యాయవాది గైర్హాజరు పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు అంగీకరించి 7వ తేదీకి విచారణ వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇండియన్ ఈవిడెన్స్ యాక్టు ప్రకారం సాక్షాధారాలైన డాక్యుమెంట్లకు సంబంధించిన సర్టిఫికేట్‌ను ఫిర్యాదుదారుడు కాసం సమర్పించలేదని సూచించింది. దీంతో డాక్యుమెంట్లను కోర్టు మార్కు చేయలేదని తెలిపింది. విచారణకు ఫిర్యాదు దారుడు కాసం కోర్టుకు హాజరు కాకపోవడంతో ఇటీవల ఆయనకు వారెంట్ జారీ చేసింది. వారెంట్‌ను రీకాల్ (తొలగించేందు) చేసుకునేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తరఫున పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు రీకాల్ చేసింది. వచ్చే వాయిదాకు ఫిర్యాదుదారుడి స్టేట్మెంట్ను రికార్డు చేయనుందని తెలిపింది. నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రిజర్వేషన్ల గురించి బీజేపీపై రేవంత్ చేసిన తప్పుడు వ్యాఖ్యల పట్ల పరువు నష్టం క్రిమినల్ కేసు నమోదైంది. 153, 171-సి, 171-జి, 499, 505 సెక్షన్ల కింద దాఖలు చేసిన పిటీషన్‌ను కోర్టు స్వీకరించి కేసు నమోదు చేసింది. త్వరితగతిన కేసు విచారణ చేపట్టేందుకు కోర్టు చర్యలు చేపట్టింది.