అంబర్‌పేట, నవంబర్ 10 : పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానలకు శ్రీకారం చుట్టారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి రోగాలకు ప్రైవేటు దవాఖానలకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టుకునే పేదలకు వైద్యం భారం అవుతుందని గమనించిన సీఎం ప్రజల వద్దకే ప్రభుత్వ వైద్యం తెచ్చి వారి వైద్య ఖర్చును తగ్గించేందుకు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు. అంచెలంచెలుగా వాటిలో డయోగ్నోస్టిక్ సేవలను కూడా తెచ్చారు. వాటి వల్ల నిత్యం ఎంతో మంది సేవలు పోందుతున్నారు. ఇందులో భా గంగా అంబర్‌పేట నియోజకవర్గంలో కూడా 8 బస్తీ దవాఖానలకు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ వచ్చిన తర్వాత వీటికి ప్రాధాన్యత ఇచ్చి నియోజకవర్గంలో 8 బస్తీ దవాఖానలకు ఏర్పాటు చేయించారు. వాటి ద్వారా పేదలకు మంచి వైద్య సేవలు అందుతున్నాయి.
అంబర్‌పేట నియోజకవర్గంలో మొత్తం 8 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు. కాచిగూడ డివిజన్లోని నింబోలిఅడ్డాలో, నల్లకుంట డివిజన్లోని సత్యానగర్, నర్సింహబస్తీ, తిలక్‌నగర్ గాంధీ బొమ్మ వద్ద, గోల్నాక డివిజన్లోని సుందర్‌నగర్, గంగానగర్‌లో, అంబర్‌పేట డివిజన్లోని పటేల్‌నగర్‌లో, బాగ్‌అంబర్‌పేట డివిజన్లోని బతుకమ్మకుంటలో వీటిని ఏర్పరచారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
ప్రతి బస్తీ దవాఖానలకు రోజుకు సరాసరి 60 నుంచి 100 మంది పేషంట్లు వస్తున్నారు. సాధారణ జబ్బులతో పాటు మధుమేహం, బీపీ పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే 57 రకాల వైద్య పరీక్షలు కూడా చేస్తారు. ఇందులో ప్రధానంగా కొలెస్ట్రాల్, కిడ్నీ, లివర్ వంటివి ఉన్నాయి. ఇవి కూడా రోజుకు 20 మంది వచ్చి టెస్టులు చేయించుకుంటున్నారు. బయట ఈ టెస్టులు చేయిస్తే రూ.3 నుంచి 4 వేల వరకు ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ పూర్తిగా ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల అనంతరం డాక్టర్ వాటిని పరిశీలించి ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు. పేదల కోసం పెట్టిన ఈ బస్తీ దవాఖానలు మంచి ప్రాచుర్యం పొందాయి. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నాయి.
ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు. బస్తీ దవాఖానల్లో సాధారణ రోగాలకు ఉచిత వైద్యం లభిస్తున్నది. 57 రకాల రక్త పరీక్షలు కూడా ఉచితంగా చేస్తున్నారు. షుగర్ వంటి వాటికి మందులను కూడా ఇస్తున్నారు. ప్రజలు కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు.
-కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్యే అభ్యర్థి