కేవలం చారిత్రక ఆనవాళ్లు.. నిజాం నవాబు కాలంనాటి డ్రైనేజీ వ్యవస్థ… కాలంతో పాటు కరిగిపోతున్న నీటి వనరులు… విస్తరిస్తున్న నగరం.. వసతుల లేమితో గోస పడుతున్న శివారు జనం… ఇదీ తెలంగాణ ఏర్పడేనాటికి హైదరాబాద్ చిత్రం! సమైక్య పాలకులు ఈ నగరాన్ని ఓ ఆర్థిక వనరుగా మాత్రమే భావించారు తప్ప మనస్ఫూర్తిగా గుండెలకు హత్తుకోలేదు. కానీ తెలంగాణ సర్కారు కొలువుదీరిన తర్వాత హైదరాబాద్ ముఖచిత్రం క్రమంగా మారింది. ఒక్కో సమస్యను అధిగమిస్తూ అభివృద్ధి వైపు ఒక్కో అడుగు వేస్తూ నగరం విశ్వ నగరంగా రూపుదిద్దుకునే లక్ష్యం వైపు పరుగులు తీస్తున్నది. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్‌ను గణనీయమైన రీతిలో బాగు చేస్తున్నామంటూ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నగరంలో మౌలిక వసతులను ఎలా అభివృద్ధి చేస్తున్నామో ఆయన గురువారం శాసన సభలో సమగ్ర వివరణ ఇచ్చారు.
నేను హైదరాబాద్ నగరంలోనే పెరిగాను. నా చిన్నతనంలో మేం ఎర్రమంజిల్ కాలనీలో ఉండేవాళ్లం. 135 నంబరు బస్సెక్కి స్కూలుకు, కాలేజీకి వెళ్లేవాణ్ని. ఆ బస్సు ఖైరతాబాద్ జలమండలి ఆఫీసు ముందునుంచే పోయేది. అక్కడ ఎప్పుడు చూసినా ఖాళీ కుండలు, ఖాళీ బిందెలతో నిరసనలు, ధర్నాలు చేసేవారు. ఆ రోజుల్లో మంచినీళ్ల ట్యాంకర్ వస్తే ముష్టి యుద్ధాలు జరిగేవి. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దుస్థితికి చరమగీతం పాడాం. 2014 నాటికి జీహెచ్ఎంసీ వ్యా ప్తంగా రోజుకు కేవలం 340 మిలియన్ గ్యా లన్ల నీటి సరఫరా జరిగేది.
శివారు ప్రాంతాల్లో అయితే 14-15 రోజులకు ఒకసారి కూడా నీళ్లు వచ్చేవి కావు. ఇప్పుడు రోజుకు 602 మిలియన్ గ్యాలన్ల మంచినీటిని సరఫరా చేస్తున్నాం. అంటే .. సరఫరాలో 77 శాతం మెరుగుదల. అంతేకాదు భవిష్యత్తులో రోజూ నీళ్లు వచ్చేలా, ఇంకా వీలైతే 24 గంటలూ ఇచ్చే ఆలోచన కూడా ఉంది. ‘నేలవిడిచి సాము చేయకండి- పేదవారి గురించి ఆలోచించండి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడూ ఓ మాట చెబుతూ ఉంటారు. ఆయన ఆలోచనలో భాగంగానే జీహెచ్ఎంసీ పరిధిలో నెలకు 20వేల లీటర్ల వరకు ఉచితంగా నీళ్లు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నాం. – మంత్రి కేటీఆర్
హైదరాబాద్ మహా నగరాన్ని ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్నట్టు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. విశ్వ నగరం చేయాలన్నదే తమ సంకల్పమని అందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అత్యంత ప్రధానమైన మంచినీటి సమస్యను తీర్చడమే కాకుండా సిటీని హరితమయం చేసేందుకు ఓ ఉద్యమంలా చెట్లు పెంచుతున్నామని, పార్కులను, లంగ్ స్పేస్‌లను అత్యంత ముఖ్యమైన ప్రాథమ్యంగా పరిగణిస్తున్నామని వివరించారు. నగరంలో ఇప్పటివరకు కల్పించిన మౌలిక వసతులు, చేసిన అభివృద్ధిపై గురువారం శాసనసభలో మంత్రి కేటీఆర్ సమగ్ర వివరణ ఇచ్చారు.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): పాత నగరాన్ని ఇస్తాంబుల్‌గా చేసి తీరుతామని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ప్రతిపక్షాల సందేహాలకు ఘాటైన జవాబిస్తూ.. ‘బరాబర్… ఇస్తాంబుల్ చేస్తాం’ అంటూ శాసనసభ వేదికగా గురువారం స్పష్టం చేశారు. చారిత్రక, అద్భుత నగరంగా కీర్తికెక్కిన హైదరాబాద్ దేశంలోనే గొప్ప కాస్మోపాలిటన్ సిటీగా పేరుగాంచిందన్నారు. ఇస్తాంబుల్ చేయడమనేది ప్రభుత్వ ఆకాంక్ష అని.. ప్రతిపక్షాలు ఎప్పుడూ ఈ మాత్రం కల కూడా కనే ధైర్యం చేయలేదని చెప్పారు. హైదరాబాద్ నలుమూలలా ఏర్పాటు చేయ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులపైనా ఆయన శాసనసభలో స్పష్టమైన వివరణ ఇచ్చారు.
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ వ్యాపారుల విషయాన్ని మజ్లిస్ ఎమ్మెల్యే మోజంఖాన్ సభ దృష్టికి తీసుకురాగా… ఏ ఒక్క వ్యాపారికీ నష్టం వాటిల్లకుండా, బాటసింగారంలో ఏర్పాటు చేసిన మార్కెట్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని సీఎం తెలిపారు. దక్షిణం వైపున టిమ్స్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చిందని, పడమర వైపు ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో 61 ఎకరాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేస్తామని, ఉత్తరం వైపు అల్వాల్‌లోని భారతీయ విద్యాభవన్‌లో 28 ఎకరాల స్థల సేకరణ పూర్తి చేశామని వెల్లడించారు. కాగా తూర్పు వైపున గడ్డి అన్నారం లాంటి ఏరియాలో 25-30 ఎకరాల్లో స్థలం దొరకడమనేది అంత సులువైన విషయం కాదని అందుకే అక్కడి నుండి పండ్ల మార్కెట్‌ను బాట సింగారానికి తరలిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండు పడకల గదుల ఇళ్లు కావాల్సిన నిరుపేదలు – 4.57 లక్షలు (2014 సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా)
వీరందరి ఇళ్ల నిర్మాణానికి అయ్యే వ్యయం – రూ. 8,598.58 కోట్లు
ప్రభుత్వం పాలనా అనుమతి ఇచ్చిన ఇళ్ల సంఖ్య – లక్ష
గృహాలు చేపట్టే స్థలాల సంఖ్య – 111 (ఇందులో 40 చోట్ల మురికివాడలు ఉన్న చోటనే, 71 ప్రభుత్వ ఖాళీ స్థలాలు)
నిర్మాణ పురోగతి – 64,628 గృహాలు పూర్తి, 35,372 గృహాల పనులు పురోగతిలో…
పూర్తికి కాల వ్యవధి – 2022 చివరి నాటికి
ప్రారంభమైనవి… – 3,870 (21 చోట్ల)
గతేడాదికే రూ.67,500 కోట్లు…
హైదరాబాద్ మహా నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి 2020 అక్టోబరు నాటికే రూ.67,500 కోట్లు ఖర్చు చేసింది. రోడ్లు, ఫ్లైఓవర్లు, ఆర్‌యూబీలు, సమర్ధ పారిశుధ్య నిర్వహణ, కోతల్లేని కరెంటు సరఫరా, పుష్కలమైన మంచినీరు, మురుగునీటి శుద్ధి… ఇలా అభివృద్ధి ప్రస్థానంలో వ్యయం ఇంకా పెరిగింది.
పారిశుద్థ్యం, ఘన వ్యర్థాల నిర్వహణలో ఆధునిక సంస్కరణలు చేపట్టారు. 2012-13 సంవత్సరంలో పారిశుద్ధ్యం రోజుకు 2500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సేకరించి, వాటి ప్రక్రియ చేపట్టారు. ప్రస్తుతం ఎస్ఏటిలను ప్రారంభించి రోజువారీ సేకరణ, శుద్ధి కార్యక్రమ సామర్థ్యాన్ని రోజుకి 6000 మెట్రిక్ టన్నులకు పెంచారు. సుమారు 20.69 లక్షల టన్నుల వ్యర్థాలను సంపూర్ణంగా శుద్ధి లేదా నిర్వహణ చేశారు. ఇప్పుడున్న 2500 ఎస్ఏటిలకు అదనంగా జీహెచ్ఎంసీ 650 స్వచ్ఛ ఆటో టిప్పర్లను సేకరించి, మరో 1350 ఆటోలకు ఆర్డర్ ఇచ్చింది .
65 ఏండ్ల సమైక్య పాలనలో హైదరాబాద్ నగరానికి మంచినీళ్లు అరకొరగా అందేవి. 2014 నాటికి రోజుకు 340 గ్యాలన్ల నీరు సరఫరా అయ్యేది. ఆ సామర్థ్యం ఇప్పుడు రోజుకు 602 మిలియన్ గ్యాలన్లకు పెరిగింది. గ్రేటర్ అవతల అవుటర్ రింగు రోడ్డు లోపలి గ్రామాలకు ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీటిని అందించేందుకు రూ.3,285 కోట్లతో పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇందుకుగాను 3700 కి.మీ. పొడవునా పైపులైన్లు, 349 మిలియన్ గ్యాలన్ల సామర్థ్యంతో 225 రిజర్వాయర్లను నిర్మించారు. మరికొన్ని నిర్మిస్తున్నారు. సరఫరాను మరింత మెరుగు పరిచేలా రూ.1200 కోట్లతో సుంకిశాల నుంచి కొత్త పైపులైన్ నిర్మిస్తున్నారు. అంతేకాదు అవుటర్ రింగు రోడ్డు చుట్టూ 158 కి.మీ. పొడవునా రింగ్ మెయిన్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. నెలకు 20వేల లీటర్ల వరకు ఉచితంగా మంచినీటిని సరఫరా చేస్తున్నారు.
వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రణాళిక (ఎస్ఆర్డిపి) కింద తెలంగాణ ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో రహదారుల నిర్మాణాన్ని చేపడుతున్నది. ఇప్పటివరకు రూ.6వేల కోట్లతో 24 చోట్ల వివిధ రకాల నిర్మాణాలు పూర్తి చేసింది. దీంతో పాటు సీఆర్ఎంపీ కింద రూ.1829 కోట్ల వ్యయంతో 724 కిలోమీటర్ల రహదారుల నిర్వహణ పూర్తి చేసింది. ఇదే కాకుండా హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 132 చోట్ల కొత్తగా లింకు, మిస్సింగ్ రోడ్ల నిర్మాణానికి కూడా ప్రణాళిక రూపొందించారు. వీటిలో ఇప్పటివకే 24 పూర్తయ్యాయి. మరో 108 పురోగతిలో ఉన్నాయి.
1) ఎల్బినగర్ ఆర్హెచ్ఎస్ ఫ్లై ఓవర్
2) బైరామల్ గూడ ఎల్హెచ్ఎస్ ఫ్లై ఓవర్
3) నాగోల్ 6 లేన్ ఫ్లై ఓవర్
4) ఎల్బినగర్ ఆర్హెచ్ఎస్ అండర్‌పాస్
5) బైరామల్‌గూడా లెవెల్2 ఫ్లై ఓవర్,
6) బైరామల్ గూడ ఎల్హెచ్ఎస్ ఫ్లై ఓవర్
7) బైరామల్ గూడ ఆర్హెచ్ఎస్ ఫ్లై ఓవర్
8) టోంబ్స్ జంక్షన్ మరియు విస్పర్ వ్యాలీ జంక్షన్
9) బొటానికల్ గార్డెన్, కొత్తగూడ మరియు కొండాపూర్ జంక్షన్ దగ్గర మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్స్/గ్రేడ్ సెపరేటర్స్
10) శిల్పా లే ఔట్ వద్ద
11) ఓవైసీ హాస్పిటల్ జంక్షన్
12) బహదూర్‌పురా జంక్షన్
13) స్టీల్‌బ్రిడ్జి గ్రేవ్‌యార్డు
14) తూకారాం గేట్ దగ్గర ఆర్యుబి
15) హైటెక్ సిటీ మరియు బోరబండ దగ్గర ఆర్ఓబి
16) చాంద్రాయణగుట్ట జంక్షన్ దగ్గర గ్రేడ్ సెపరేటర్
17) నల్గొండ రోడ్ నుండి ఓవైసీ జంక్షన్ వరకు
18) ఇందిరాపార్కు నుండి విఎస్టి మెయిన్ రోడ్ జంక్షన్ వరకు స్టీల్ బ్రిడ్జి
19) ఫలక్‌నుమా దగ్గర ఆర్ఓబి
20) శాస్త్రిపురం రోడ్ దగ్గర ఆర్ఓబి
21) ఆరాంఘర్ నుండి జూ పార్కు వరకు ఫ్లై ఓవర్
22) అంబర్పేట్ 6 రోడ్స్, ఫ్లై ఓవర్
23) ఆరాంఘర్ నుండి శంషాబాద్ సెక్షన్ వరకు
24) ఉప్పల్ నుండి సిపిఆర్ఐ వరకు.
నగరంలో ప్రతి ఏటా వర్షాలు కురవడం, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవడం పరిపాటి. కానీ జనం పడుతున్న ఈ బాధలు ఇక కొనసాగొద్దనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా గత ఏడాది అక్టోబరు 2న వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమాన్ని (ఎస్ఎన్డిపి) ఏర్పాటు చేసింది. నగరంలోని పాత వరద కాల్వలు 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిస్తే తట్టుకునే పరిస్థితిలో లేవు. ఈ నేపథ్యంలో వరదనీటి కాలువల అభివృద్ధికి రూ. 858.00 కోట్లతో పదిహేను పనులకు మంజూరు ఇచ్చింది. ఇందులో పలు పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి.
హైదరాబాద్.. సికింద్రాబాద్‌తో జంట నగరాలుగా… సైబరాబాద్… ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్… ఇలా నానాటికీ విస్తరిస్తున్న ఈ మహా నగరంలో మరో మినీ నగరానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కోకాపేటలో 530 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో మినీ నగరాన్ని తీర్చిదిద్దుతుంది. ఇందుకుగాను హెచ్ఎండీఏ రూ.250 కోట్లతో పనులు కొనసాగిస్తున్నది.
దేశంలోని ఏ మెట్రో నగరమూ సాధించని ఘనతను హైదరాబాద్ మహా నగరం సాధించబోతున్నది. నగరంలో ప్రతిరోజూ ఉత్పత్తి అవుతున్న 160 కోట్ల లీటర్ల మురుగును వంద శాతం శుద్ధి చేసి మూసీలోకి వదిలేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న శుద్ధిసా మర్థ్యానికి అదనంగా రోజుకు 125 కోట్ల లీటర్ల మురుగును శుద్ధి చేసే సామర్థ్యంతో 31 మురుగునీటి శుద్ధి కేంద్రాలను 3866.6 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. తాజాగా వాటికి టెండర్లు కూడా పిలిచారు.
హైదరాబాద్ మహా నగర పరిధిలో పచ్చదనం పరుచుకుని అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటుందంటే దాని వెనక ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంతో ఉంది. మచ్చుకు నర్సరీల సంఖ్యను చూస్తే ఇది అర్థమవుతుంది. తెలంగాణ ఏర్పడేనాటికి హైదరాబాద్ పరిధిలో కేవలం 141 నర్సరీలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 1602. అంతేకాదు… నగరంలో వాయు కాలుష్యం పెరిగి ఆక్సిజన్ కొనుగోలు చేసే పరిస్థితి రావద్దనే సీఎం కేసీఆర్ ముందు చూపుతో 1.66 లక్షల ఎకరాల్లో అర్బన్ ఫారెస్ట్ లంగ్ స్పేస్‌లను అభివృద్ధి చేస్తున్నారు.
దేశానికే స్ఫూర్తిగా నిలిచిన హైదరాబాద్ బస్తీ దవాఖానలు మరిన్ని పెరగనున్నాయి. ఇప్పటికే 226 సేవలు అందిస్తుండగా, మరో 32 త్వరలో ప్రారంభం కానున్నాయి. వీటి సంఖ్య ఏడాది చివరి నాటికి 350కి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా ప్రైవేటు డిస్పెన్సరీలు మూతబడే పరిస్థితి వచ్చింది.
పౌరులకు ఎలాంటి అవరోధాలు, ఆటంకాలు లేకుండా బిల్డింగ్ ప్లాన్ ఆమోదాలు జారీ చేసే లక్ష్యంతో తెలంగాణా ప్రభుత్వం తెలంగాణా రాష్ట్ర భవన నిర్మాణ అనుమతి లే ఔట్ ఆమోదాల స్వీయ ధృవీకరణ విధానాన్ని (టిఎస్‌బిపాస్) ప్రవేశపెట్టింది. టీఎస్‌బిపాస్ దరఖాస్తును లాంఛన ప్రాయంగా గత ఏడాది నవంబరు 11న ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలో గత పది నెలల కాలంలో జీహెచ్ఎంసీకి 8507 దరఖాస్తులు, హెచ్ఎండీఏ కు 17,381 దరఖాస్తులు వచ్చాయి.