బడంగ్‌పేట, మే 8 ; ఆటలు ఆడాలనే ఆసక్తి ఉండి అవకాశం లేక సత్తా చాటాలనుకునే గ్రామీణ క్రీడాకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అరుదైన అవకాశాన్ని కల్పించింది. ఇప్పటికే గ్రామాల్లో క్రీడలకు పెద్దపీట వేస్తూ క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేసిన సర్కారు తాజాగా క్రీడాకారుల ప్రతిభ వెలికితీసేందుకు రాష్ట్రంలో తొలిసారిగా సీఎం కప్ పోటీలను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నది. ఈ నెల 15 నుంచి మండల స్థాయి గేమ్స్ జరుగనుండగా, క్రీడా కమిటీకి ఎంపీపీ చైర్మన్‌గా, ఎంపీడీవో కన్వీనర్‌గా జడ్పీటీసీ, తాసీల్దార్, ఎంఈవో, ఎస్ఐ, మున్సిపల్ కమిషనర్, పీడీ, పీఈటీలను సభ్యులుగా ఏర్పాటు చేశారు. పాల్గొనాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ మండల కమిటీలను సంప్రదించి పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయి వరకు సత్తా చాటే అరుదైన అవకాశం కల్పించింది.
తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు, క్రీడాకారులకు పెద్దపీట వేస్తున్నది. ఇప్పటికే గ్రామీణ స్థాయిలో క్రీడాభివృద్ధి కోసం ప్రతి గ్రామంలో గ్రామీణ ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. గ్రామీణ, పట్టణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడాకారుల్లో దాగి ఉన్న క్రీడా స్పూర్తిని వెలికితీసేందుకు తొలి సారిగా సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ (శాట్) సహకారంతో సీఎం కప్-2023ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఈ నెల 15 నుంచి 31వ తేదీ వరకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 15 నుంచి 36 ఏండ్ల లోపు యువతీ యువకులు అర్హులు.
విజేతలకు నగదు ప్రోత్సాహకాలు
రాష్ట్ర స్థాయి పోటీల్లో సర్టిఫికెట్లతో పాటు వివిధ క్రీడల్లో గెలుపొందే జట్లకు మొదటి బహుమతి కింద రూ.లక్ష, ద్వితీయ బహుమతి కింద రూ. 75 వేలు, తృతీయ బహుమతి కింద రూ. 50 వేలు, వ్యక్తిగత క్రీడల్లో ప్రథమ రూ. 20 వేలు, ద్వితీయ రూ. 15 వేలు, తృతీయ రూ. 10 వేల నగదు బహుమతులను అందజేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు నేటి నుంచి తమ పేర్లను మండలాల్లో, మున్సిపాలిటీ కార్పొరేషన్లలో పేర్లు నమోదు చేసుకోవాలి. ఈ ఆటల పోటీలకు ఎంపీపీ చైర్మన్‌గా, జడ్పీటీసీ సభ్యులుగా, ఎంపీడీవో కన్వీనర్‌గా, ఎంఆర్ఓ, ఎంఇవో, ఎస్ఐ, మున్సిపల్ కమిషనర్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కమిషనర్ పూర్తి బాధ్యతలు తీసుకోనున్నారు. అందులో భాగంగానే సోమవారం బడంగ్‌పేట మున్పిపల్ కార్పొరేషన్లో ఎంఈవోలు, మున్సిపల్ అధికారులు సమావేశం అయారు. మీర్‌పేట, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్, జల్పల్లి మున్సిపాలిటీలో ఆటల పోటీలను నిర్వహించడానికి కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి బాధ్యత నిర్వహించనున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 15 నుంచి 36ఏండ్ల లోపు క్రీడాకారులు తమలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం తొలిసారిగా సీఎం కప్ క్రీడలను నిర్వహిస్తున్నది. ఈ వయసులోపు ఉన్న వారంతా తమకు ఆసక్తి ఉన్న క్రీడల్లో మండల స్థాయిలో పాల్గొని ప్రతిభ చాటి ఆ తర్వాత జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆడాల్సి ఉంటుంది. అలా ఆడటం ద్వారా రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. ప్రతిభను చూపేందుకు ఇదే చక్కని అవకాశం. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 79897 92414లో సంప్రదించండి.
– కృష్ణయ్య ఎంఇవో