వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండంలో భారతీయ నావికా విభాగం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తున్న వెరీ లో ఫ్రీక్వెన్సీ ప్రాజెక్టు వల్ల మానవ మనుగడే అసాధ్యమవుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు.
-ఖైరతాబాద్, అక్టోబర్ 14
VLF Project | సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్టు సంపత్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాడార్ ప్రాజెక్టు వల్ల ప్రజలు, పర్యావరణానికి జరిగే నష్టాలు, ప్రకృతి వైపరీత్యాలపై వక్తలు మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వల్ల ఇప్పటికే భద్రాచలంలో నవగ్రహ ఆలయం, పర్ణశాల మునిగిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. యావత్ ప్రజానీకానికి, పర్యావరణానికి నష్టం చేకూర్చే వీఎల్ఎఫ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని విరమించుకోవాలన్నారు. ఒక చెట్టుకు పది చెట్లు నాటుతామని చెబుతున్నా..అది సాధ్యం కాదన్నారు. ప్రాజెక్టు పేరుతో సహజ వనరులను దెబ్బతిస్తున్నారని, ఇందులో పాలకులు మతలబు వేరే ఉంటుందన్నారు. దామగుండం నిర్మాణం జరిగితే ప్రజలే మునిగిపోతారని అన్నారు.
పర్యావరణవేత్త ప్రొఫెసర్ బాబురావు మాట్లాడుతూ దామగుండం ప్రాజెక్టు వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, ఉన్న అడవులను నాశనం చేసుకుంటూ పోతే మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఈ ప్రాజెక్టుతో స్థానికులకు ఎలా ఉద్యోగాలు వస్తాయని ప్రశ్నించారు. ప్రొఫెసర్ వినాయక్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ప్రాజెక్టులకు సముద్ర తీరాలను ఎంచుకోవాలని, కానీ ప్రజల మధ్య ప్రాజెక్టును నిర్మిస్తామనడం సరికాదన్నారు.
పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య మాట్లాడుతూ దామగుండంలో 2,900 ఎకరాల్లో ఔషధ మొక్కలు ఉన్నాయని, అక్కడ దేవాలయానికి సంబంధించిన 1,400 ఎకరాల భూమిని ఇప్పటికే కోల్పోయారని, ఈ ఆలయంలోని గుండంలో 8.5 పీహెచ్ కలిగిన నీరు ఉందని, అందులో ఔషధ గుణాలున్నాయన్నారు. అడవి పోతే మరో అడవిని తయారు చేస్తామంటున్నారని, అడవి అనేది సహజంగా ఏర్పడుతుందని, కృత్రిమంగా తయారు చేస్తే అది జీవ వైవిధ్యాన్ని తిరిగి తెచ్చిపెట్టలేదని అన్నారు. రాష్ట్రంలోని చెట్లు పెరగని ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టును నిర్మించుకోవాలన్నారు.
తెలంగాణ విఠల్ మాట్లాడుతూ ప్రజల మధ్య, ప్రకృతివనంలో రాడార్ స్టేషన్ నిర్మించాలనుకుంటే అక్కడ గ్రామ సభలు, డిబేట్లు ఎందుకు నిర్వహించలేదని, ప్రజాభిప్రాయం ఎందుకు సేకరించలేదని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే ఈ ప్రాజెక్టును వ్యతిరేకించారని, అలాంటప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం రాడార్ స్టేషన్‌ను ఎందుకు నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. బడాబాబులకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి బంధం బయటపడిందన్నారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందించాలన్నారు.
ైక్లెమెట్ ఫ్రంట్ ప్రతినిధి రుచిత్ మాట్లాడుతూ గత ఐదేండ్ల నుంచి దామగుండాన్ని పరిశీలిస్తున్నామని, 12 లక్షల మొక్కలు తొలగించడం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుందని, అయితే ఫారెస్టు అధికారుల వద్ద సరైన డాటా కూడా లేదని, ఎన్ని లక్షల చెట్లు తొలగిస్తున్నారో ఆన్లైన్లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖ ఒక్క చెట్టునూ తొలగించడం లేదంటే, ఫారెస్టు అధికారులు మాత్రం ఒక లక్ష చెట్లను తొలగిస్తున్నట్లు చెబుతున్నారన్నారు. మంత్రికి అధికారుల మధ్య సమన్వయం లేదని చెప్పారు. ఈ అడవికి బదులు 17 లక్షల చెట్లు నాటుతామని చెబుతున్నారని, అది ఫెయిల్యూర్ ప్రక్రియ అని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్, జర్నలిస్టు తులసి చందు తదితరులు పాల్గొన్నారు.