మెహిదీపట్నం, జనవరి 17: మల్లేపల్లి సీతారాంబాగ్‌లో ఈ నెల 23 నుంచి ఫిబ్రవరి 2 వరకు 10 రోజుల పాటు ఉచిత మెగా ప్లాస్టిక్ సర్జరీ శిబిరం నిర్వహించనున్నట్లు సేవాభారతి ట్రస్టీ, లయన్స్‌క్లబ్ ఆఫ్ గ్రీన్‌ల్యాండ్ అధ్యక్షుడు డాక్టర్ విద్యాభూషణ్ తెలిపారు. మంగళవారం సీతారాంబాగ్‌లో ఉన్న డాక్టర్ ఈశ్వర్‌చంద్ర చారిటబుల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్లు విద్యాభూషన్, లక్ష్మీకుమారి, నిహారి, కమల్ కుమార్, డీసీపీ పరవస్తు మధుకర్ స్వామితో కలిసి వివరాలను వెల్లడించారు.
సమాజంలో గ్రహణం మొర్రి, కాలిన గాయాలతో బాధ పడేవారికి, చేతులు , వాటి వేళ్లు, గొంతు అతుక్కొని ఉన్న వారికి ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించడానికి ఈ శిబిరం ఏర్పాటు చేశామని చెప్పారు. సర్జరీ చేయించుకోవాలనుకునే వారు ఈ నెల 17 నుంచి తమ పేర్లను 9848 241 640, 9177 254 912 నంబర్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు.