సిటీబ్యూరో, మారేడ్‌పల్లి, జూన్ 27 (నమస్తే తెలంగాణ): బేగంపేట విమనాశ్రయ పరిసర ప్రాంతాల్లోని బహుళ అంతస్తుల భవనాల ఎత్తును తగ్గించడం లేదా పూర్తిగా తొలగించేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ గెజిట్ జారీ చేసింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో సెంట్రల్ ఏవియేషన్ అథారిటీ ఈ నిర్ణయం తీసుకున్నది. విమానాశ్రయాలకు సమీపంలో ఎత్తయిన భవనాలు, చెట్లు ఉండటం ప్రమాదాలకు కారణమవుతున్నదని పేర్కొంది. ముందస్తు జాగ్రత్తగా ప్రమాదాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
ఈ మేరకు ఎయిర్ క్రాఫ్ట్ నిబంధనలు-2025 పేరుతో ఒక ముసాయిదా విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం ఏరో డ్రోమ్ జోన్లలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాల ఎత్తును తగ్గించడం లేదా అవసరమైతే పూర్తిగా కూల్చివేయడం వంటి చర్యలు చేపడతారు. సంబంధిత అధికారులు ముందుగా భవనాల యజమానులకు నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు అందిన 60 రోజుల్లోగా కూల్చివేయాలి.
ఏమైనా అభ్యంతరాలుంటే ఆ 60 రోజుల్లోపే తెలియజేయాలి. ఇచ్చిన గడువు దాటినా కూడా భవనాలను కూల్చకుంటే కలెక్టర్ ఆధ్వర్యంలో ఏరో డ్రోమ్ అధికారులు కూల్చివేతలు చేపడతారు. అయితే బేగంపేట విమానాశ్రయ పరిసరాలు కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్నాయి. ఆ ప్రాంత ప్రజలు మాత్రం తమ ఇండ్లను కూల్చొద్దని జనావాసాల మధ్యలో ఉన్న విమానాశ్రయాన్ని శివారు ప్రాంతమైన దుండిగల్‌కు తరలించాలని కోరుతున్నారు. గతంలో విమానాశ్రయ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండేదని.. నగరం మరింత విస్తరించడంతో ఇప్పుడు సిటీ నడి మధ్యలోకి వచ్చిందని ఆ ప్రాంత ప్రజలు అంటున్నారు. భవనాలను కూల్చకుండా విమానాశ్రయాన్నే ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
నగరం నడిబొడ్డున ఉన్న బేగంపేట విమానాశ్రయాన్ని దుండిగల్ ఎయిర్‌పోర్టుకు తరలించాలని కంటోన్మెంట్ వికాస్ మంజ్ జనరల్ సెక్రటరీ సంకి రవీందర్ బాబు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన విమానాయాన సంస్థ నిబంధనల ప్రకారం ప్రజలు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు నివేదిక రూపంలో ఇవ్వవచ్చని ఏవియేషన్ అధికారులు వెల్లడించారని చెప్పారు. ఇందులో భాగంగానే ఒక నివేదికను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులకు కంటోన్మెంట్ వికాస్ మంజ్ ప్రతినిధులు అందజేశారు.
ఈ సందర్భంగా శుక్రవారం మహీంద్రాహిల్స్‌లోని వికాస్ మంచ్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంకి రవీందర్ మాట్లాడుతూ..అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద తరహా ఘటనలు మరోసారి జరగకుండా ఉండాలంటే భవనాలను తొలగించడం సరైన నిర్ణయం కాదన్నారు. నగరం మధ్యలో ఉన్న బేగంపేట ఎయిర్‌పోర్టును దుండిగల్ ఎయిర్‌పోర్టుకు తరలించాలని కోరారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఏండ్ల తరబడి ఉంటున్న ప్రజల ఇండ్లను కూల్చడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
విమానాశ్రయం ఇక్కడ ఉండడం వల్ల విమానాల రాకపోకలకే కాకుండా, పౌరుల భద్రతకు ముప్పు ఏర్పడుతుందన్నారు. దుండిగల్‌కు తరలించడం వల్ల మరిన్ని సర్వీసులను కూడా పెంచవచ్చని అభిప్రాయపడ్డారు. దుండిగల్ ఎయిర్ పోర్టు వద్ద స్థలం, మెరుగైన భద్రత, తక్కువ ట్రాఫిక్ వంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో వికాస్ మంచ్ సభ్యులు ఫసి, అంబాల శ్రీనివాస్, ఎలగంటి దేవేందర్, మధుసూదన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వహీద్, గిరిధర్, సతీశ్ కుమార్, ప్రకాశ్, సాయి బాబా తదితరులు పాల్గొన్నారు.