సిటీబ్యూరో/ మల్కాజిగిరి/మణికొండ/మేడ్చల్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) నాలుగు గోడల మధ్య కూర్చొని హడావిడిగా జీహెచ్ఎంసీని విభజించిన కాంగ్రెస్ ప్రభు త్వం.. వాటికి తగిన మౌలిక వసతులు కల్పించకపోవడం ప్రజలు అవస్థలుపడుతున్నారు. ముఖ్యంగా ఎంఎంసీలో 74 వార్డులగా విభజించగా గతంలోని డివిజన్లు చాలా వరకు రెండు విభజించి, రెండు డివిజన్ల సరిహద్దులు చేర్చా రు. కొన్ని డివిజన్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో డివిజన్ల పాలన, నిధుల కేటాయింపు, అభివృద్ధి పనుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఎంఎంసీ ఏర్పాటుకు తగిన విధంగా సిబ్బందిని ఇవ్వకపోవడంతో ఉన్న సిబ్బందితోనే పాలన కొనసాగిస్తున్నారు. టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, రెవెన్యూ విభాగాలలో సిబ్బంది లేకపోవడంతో నలుగురి పని ఒక్కరే చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. చాలా వరకు సర్కిల్స్‌లలో ఇప్పటికి టౌన్ ప్లానింగ్ సీపీలు, ఎస్ఈ, ఈఈలు లేరు. ఇన్‌చార్జిలతోనే కాలం వెల్లదిస్తున్నారు. కిందిస్థాయి ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో పాలన అస్తవ్యస్తంగా మారింది.
నియోజకవర్గాలను విడదీసిన కార్పొరేషన్ పాలన
మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్, మల్కాజిగిరి సర్కిల్స్ ఉండగా, యాప్రాల్ ప్రాంతాన్ని కీసర సర్కిల్లో మార్చడంతో నియోజకవర్గ ప్రజలు కీసర మున్సిపాలిటీకి వెళ్లాల్సి వస్తున్నది. సనత్‌నగర్ నియోజకవర్గం ఎంఎంసీ, జీహెచ్ఎంసీలో భాగంగా చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్దఅంబర్‌పేట ప్రాంతం ఎంఎంసీలో ఉండగా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిబట్ల, తుర్కయాంజల్ సర్కిల్స్ జీహెచ్ఎంసీలో ఉంది. మేడ్చల్ నియోజకవర్గం ఎంఎంసీలో కొంతభాగం, సీఎంసీలో కొంతభాగంగా ఉంది. దీంతో పాలన వ్యవస్థపై ప్రభావం చూపుతున్నది.
ఆన్లైన్లో అంతా జాప్యమే..
ఎంఎంసీ ఏర్పాటు తర్వాతా అక్రమ నిర్మాణాలు పెరిగాయి. పట్టణ ప్రణాళిక విభాగం గాడితప్పింది. అనుమతులు ప్రక్రియలో విపరీతమైన జాప్యం జరుగుతున్నది. చేసిన పనులకు బిల్లులు రావడంలేదని పనులు చేయడం లేదు. టెండర్లు వచ్చిన కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించడానికి ముందుకురావడం లేదు.
విలీన మున్సిపాలిటీల్లో అధ్వానం
ట్రై కార్పొరేషన్ పరిధిలో విలీనమైన మున్సిపాలిటీ, కార్పొరేషన్ ప్రాంతాలలో పాలన అధ్వానంగా మారింది. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. గుంతలమయంగా మారిన రోడ్లు గురించి పట్టించుకోవడం లేదు. నీటి వనరులు కలుషితం అవుతున్నాయి. తాగునీటి సమస్య తీవ్రతరం అయింది. సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపాలిటీ కార్పొరేషన్లలో విలీనమైన నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిస్థితి దయనీయంగా మారింది. మ్యాన్‌హోల్ మూతను కూడా పెట్టించుకోలేని పరిస్థితి ఉంది. మున్సిపాలిటీలో ఉన్నప్పుడు అధికారులు, సిబ్బంది దృష్టికి సమస్యలు తీసుకుపోగా మేడ్చల్, పూడూరు-కిష్టాపూర్ డివిజన్లలో ఎన్జీవోఎస్ కాలనీ, కేఎల్ఆర్ వెంచర్, చంద్రానగర్, సామాజిక ఆరోగ్యం కేంద్రం ప్రాంతాలతో పాటు రెండు డివిజన్ పరిధిలోని మెజార్టీ ప్రాంతాల్లో డ్రైనేజీ నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నది. దీంతో పరిసర ప్రాంతాలు కంపుకొడుతున్నాయి. నీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు డివిజన్లలో వేలాది మంది ఒక్కో ట్యాంకర్‌కు రూ.800 చెల్లించి, నీటిని కొనుగోలు చేయాల్సి వస్తుంది.

కొత్త సమస్యలకు అవకాశం లేకుండా : వెంకన్న, మల్కాజిగిరి
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి చొరవతోనే చాలా వరకు పనులపై కదలికలు వస్తున్నాయి. అనేకసార్లు తిరిగితే తప్ప పనులు ముందుకుసాగడంలేదు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారించాలి. కార్పొరేషన్ ఏర్పాటుతో సమస్యలు తీరాలి కానీ కొత్త సమస్యలకు అవకాశం లేకుండా చూడాలి.
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం : మహేందర్, ఉప్పల్
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం పెరిగింది. రోడ్లు, వాటర్, పారిశుధ్యం సమస్యలు పెరిగాయి. ముందస్తు చర్యలు లేవు. వసూళ్లు తప్ప, ఎలాంటి ప్రభుత్వ ఆదాయానికి పెంచే మార్గాలు చేపట్టడంలేదు. అధికారులు అందుబాటులో ఉండటంలేదు.
పరిస్థితి గందరగోళం: ఖమ్రోద్దీన్, ఎన్జీవోఎస్ కాలనీ
మున్సిపాలిటీ కార్పొరేషన్లో విలీ నం అయినప్పటి నుంచి మేడ్చల్ పరిస్థితి గందరగోళం మారింది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఎన్జీవోఎస్ కాలనీలో నెలకొన్న పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు.
రోడ్డుపై డ్రైనేజీ నీరు బందెల రమేశ్, రాంపల్లి
మున్సిపాలిటీ కార్పొరేషన్లో విలీనం తర్వాత స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కారం కావడం లేదు. డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడం లేదు. సరైన నిర్వహణ లేకపోవడంతో డ్రైనేజీ నీరు రోడ్డుపై ప్రవహిస్తుంది.