ఎల్బీనగర్, మే 13: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదకొండు ఏండ్లుగా కార్మిక, ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్నదని సీఐటీయూ (CITU) నాయకులు విమర్శించారు. చైతన్యపురిలోని సిఐటీయూ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులు సమావేశం జరిగింది. సరూర్నగర్ సర్కిల్ కన్వీనర్ మల్లె పాక వీరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రంగారెడ్డి జిల్లా సీఐటీయూ కార్యదర్శి ఎం చంద్రమోహన్, రంగారెడ్డి జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షులు కీసరి నర్సిరెడ్డి, జీహెచ్ఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు ఆలేటి ఎల్లయ్య హాజరై మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా కార్మిక, ప్రజావ్యతిరేక పాలన సాగిస్తుందన్నారు. జాతీయ సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు అమ్మేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలపై పెను భారం మోపుతున్నదని విమర్శించారు. కార్మిక, ప్రజా ఉద్యమాలపై ఉక్కు పాదం మోపి, పౌరులు ప్రాథమిక హక్కులకు సైతం కేంద్రం పాత్రరేస్తున్నదని చెప్పారు. ఉపాధి, నిరుద్యోగ, అధిక ధరలు, ఆకలి, అసమానతలు, ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలను మరింత త్రీవరూపం దాల్చాయన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మున్సిపల్ కాంట్రాక్టర్లు, కార్మికులకు వేతనాలు పర్మినెంట్ చేసి రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
జీహెచ్ఎంసీ కార్మికులకు అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని, జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల ఔట్సోర్సింగ్ సిబ్బందిని హైకోర్టు ఆదేశాల ప్రకారం పర్మినెంట్ చేయాలన్నారు. అనారోగ్యానికి గురై చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని, మే 20న జరిగే దేశవ్యాప్త సారత్రిక సమ్మెను జయప్రదం చేయాలని మున్సిపల్ కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ హయత్నగర్ సర్కిల్ నాయకులు కృష్ణయ్య, సరూర్నగర్ సర్కిల్ నాయకులు రాములు మల్లేష్, మున్సిపల్ కార్మికులు పద్మ, నవనీత, గీత, అరుణ, సరస్వతి, సంతోష, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.