జవహర్‌నగర్, జనవరి 15: దేశ భద్రతలో ధైర్యసాహసాలతో కూడిన సేవలు అందించాలని, లోటుపాట్లకు లోనుకాకుండా నిస్వార్థంగా పనిచేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని శిక్షణ పొందిన అసిస్టెంట్ కమాండెంట్స్కు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ రజ్వీందర్సింగ్ భట్టి ఐపీఎస్ పిలుపునిచ్చారు. బుధవారం శామీర్‌పేట మండలం హాకీంపేట్లోని (నీసా) నేషనల్ ఇండస్ట్రియల్ అథారిటీ పరేడ్ గ్రౌండ్లో శిక్షణ పొందిన 37వ బ్యాచ్ అసిస్టెంట్ కమాండోలు 53 మంది, 20వ బ్యాచ్‌కు చెందిన 221 మంది కానిస్టేబుళ్లకు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా డైరెక్టర్ జనరల్ రజ్వీందర్సింగ్ భట్టి ఐపీఎస్ హాజరై పరేడ్‌ను ప్రారంభించి మాట్లాడారు. శిక్షణ పూర్తి చేసుకున్న అసిస్టెంట్ కమాండోలకు.. స్టార్ పెట్టేటప్పుడు కమాండోల తల్లిదండ్రులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. కార్యక్రమంలో నీసా డైరెక్టర్ కె.సునీల్ ఇమ్మాన్యుయేల్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనువాసబాబు, అధికారులు, జవాన్ల తల్లిదండ్రులు, నీసా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.