Mahesh Bhagwat | డ్రగ్స్ అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకోవడంలో తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉందని సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డ్రగ్స్ పెడ్లర్స్‌పై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ)యాక్ట్ నమోదు చేస్తున్నామని వెల్లడించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా సోమవారం కార్యాలయంలో క్లౌడ్ ఫొటోగ్రాఫర్ యూనస్ ఫర్హాన్ రూపొందించిన ‘సే నో టు డ్రగ్స్’ అనే పోస్టర్‌ను ఆవిష్కరించారు.
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మరిన్ని రూపొందించాలని యూనస్‌ను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎన్డీపీఎస్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, పదే పదే డ్రగ్స్, మానవ అక్రమ రవాణాకు పాల్పడే వారిని జైళ్లకు సైతం పంపిస్తున్నారని చెప్పారు. సైబరాబాద్ పరిధిలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులకు సంబంధించి అధికంగా కన్విక్షన్ రేటు ఉన్నట్లు వెల్లడించారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో అధికంగా గంజాయి అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సింథటిక్ డ్రగ్స్‌ను పూర్తిగా అరికట్టే కార్యక్రమం చురుగ్గా సాగుతుందని.. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యాంటీ నార్కోటిక్ బ్యూరోను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇప్పటికే డ్రగ్స్ బానిసైన యువతను గుర్తించి రీహాబిలిటేషన్‌కు పంపే ప్రయత్నం పోలీస్ శాఖ చేస్తున్నదని, వారిపై ఎలాంటి కేసులు లేకుండానే డ్రగ్స్ బారి నుంచి విముక్తి కల్పించే విధిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారనికి మహేశ్ భగవత్ తెలిపారు.