ఉప్పల్, మే 29: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం శ్రమిస్తున్నామని చిలుక నగర్ డివిజన్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ (Bannala Geetha Praveen) అన్నారు. ఈ మేరకు గురువారం జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో ఎటువంటి జాప్యం జరగకుండా, పనుల్లో నాణ్యత పాటించాలని తెలిపారు. నిర్మాణ సమయంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా, అన్ని జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా కాలనీ సభ్యులతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని, దశలవారీగా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాఘవేంద్ర నగర్ కాలనీలోని సీసీ రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ నిర్ణీత సమయంలో కాలనీ అసోసియేషన్ సభ్యులకు అతి త్వరలో సీసీ రోడ్డు అందుబాటులోకి తెచ్చే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
చిల్కానగర్ డివిజన్లో గత నాలుగేండ్లలో సుమారు రూ.90 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరిగాయని పేర్కొన్నారు. అభివృద్ధికి పెద్దఎత్తున నిధులకు సహకరిస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు డీ.ఈ వెన్నెల గౌడ్, ఏఈ రాధిక, వర్క్ ఇన్స్పెక్టర్ కేదార్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు కొండల్ రెడ్డి, ముద్దం శ్రీనివాస్ యాదవ్, బాణాల నారాయణరెడ్డి, కోకొండ జగన్, శ్యామ్, రాఘవేందర్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కౌశిక్, సోమేశ్, ఉదయ్, డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.