Hyderabad | హైదరాబాద్ : చిన్నారులను విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఇటీవల మేడిపల్లిలో చిన్నారి విక్రయంతో ఈ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
నాలుగు రోజుల క్రితం పీర్జాదిగూడలో రూ. 4.50 లక్షలకు ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణి శిశువును విక్రయించారు. ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయడంతో ముఠా గుట్టురట్టయింది. మొత్తం 16 మంది ఈ చిన్నారులను విక్రయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సందర్భంగా కేసు వివరాలను రాచకొండ సీపీ తరుణ్ జోషీ మంగళవారం మీడియాకు వెల్లడించారు.
పిల్లల విక్రయ ముఠా రాకెట్‌తో సంబంధం ఉన్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల మేడిపల్లిలో శోభారాణి, సలీం, స్వప్నలను అరెస్టు చేశాం. వారిని అరెస్టు చేసిన సమయంలో ఇద్దరు చిన్నారులను రక్షించాం. సంతానం లేని వారికి పిల్లలను విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు స్పష్టం చేశారు.
ఢిల్లీ, పుణె నుంచి చిన్నారులను తీసుకొచ్చి అమ్ముతున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు సీపీ. ఢిల్లీ, పుణెలో ఉన్నవారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం వెళ్లిందన్నారు. తల్లిదండ్రుల నుంచి రూ. 50 వేలకు కొనుగోలు చేసి రూ. 1.80 లక్షల నుంచి రూ. 5.50 లక్షల వరకు చిన్నారులను విక్రయిస్తున్నారని రాచకొండ సీపీ తెలిపారు.
పిల్లలను విక్రయిస్తున్న ముఠాని పట్టుకున్న పోలీసులు
పిల్లలను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి.. 16 మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు కాపాడారు.
పిర్జాదిగూడ రామకృష్ణ నగర్ లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా 3 నెలల పసికందు నుంచి ఏడాది పిల్లల వరకు విక్రయాలు… pic.twitter.com/50MESzBmkc
— Telugu Scribe (@TeluguScribe) May 28, 2024