వెస్ట్‌మారేడ్‌పల్లిలోని మున్సిపల్ క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ను గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ తరగతులను పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లల క్రీడావిన్యాసాన్ని చిత్రంలో చూడొచ్చు
సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ)/మారేడ్‌పల్లి, ఏప్రిల్ 27 : విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని మున్సిపల్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ను మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మంత్రి ఎదుట మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..జీహెచ్ఎంసీ ప్రతి సంవత్సరం వేసవి కాలంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లను నిర్వహిస్తున్నదని అన్నారు. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లను 6 నుంచి 16 సంవత్సరాల పిల్లలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 120 సెంటర్లలో కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
విద్యార్థులను వివిధ క్రీడల్లో ప్రోత్సహించే ఆలోచనతోనే ప్రభుత్వం ప్రతి సంవత్సరం సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లను నిర్వహిస్తున్నదని తెలిపారు. ఈ క్యాంప్‌లో క్రికెట్, బాక్సింగ్, వాలీబాల్, పుట్‌బాల్, స్విమ్మింగ్ తదితర క్రీడల్లో అనుభవజ్ఞులైన కోచ్‌లతో శిక్షణ ఇస్తారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏ రంగాల్లో ఆసక్తిని కనబరుస్తున్నారో గుర్తించి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తమ పిల్లలను వివిధ క్రీడల్లో తగిన శిక్షణ ఇప్పించేందుకు సమ్మర్ కోచింగ్ క్యాంప్ లలో చేర్పించాలని సూచించారు. అనంతరం డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి మాట్లాడుతూ..ఏప్రిల్ 25 నుంచి మార్చి 31 వరకు సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లు కొనసాగుతున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ అతి తక్కువ ఫీజుతో శిక్షణ అందిస్తున్నదన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దీపిక, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డీసీ మోహన్‌రెడ్డి, స్పోర్ట్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కోచ్‌లు కె.కృష్ణ, కె.ఆర్ విజయానంద్, ఎస్. కుమార్, కె.పి. కృష్ణ, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.