మేడ్చల్, అక్టోబర్17(నమస్తే తెలంగాణ): మేడ్చల్లో బుధవారం జరిగే ప్రజా ఆశ్వీరాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. మేడ్చల్లోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. లక్ష మందితో సభ నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులతో మంత్రి మల్లారెడ్డి సమావేశమై జనసమీకరణ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 15 ఎకరాల విస్తీర్ణంలో సీఎం కేసీఆర్ సభ జరగనున్నది. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో గూలాబీమయంగా మారింది. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా కుర్చీలను ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభకు పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
మేడ్చల్లోని సభాస్థలిని మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజు పరిశీలించారు. ఇరువురు సభా ప్రాంగాణాన్ని పరిశీలించి ఏర్పాట్లపై తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని మండలాల, మున్సిపాలిటీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో సమావేశమై సీఎం బహిరంగ సభ విజయవంతమయ్యేలా చూడాలని కోరారు.
మేడ్చల్లో జరిగే ప్రజా ఆశ్వీరాద సభను లక్ష మందితో నిర్వహిస్తాం. సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేస్తాం. తొమ్మిదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ రాష్ర్టాభివృద్ధిని చూసి ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాల హామీలపై రాష్ట్ర ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్లో నేడు జరిగే సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేసి సీఎంకు మద్దతు తెలపాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాల అమలు హామీలపై విడుదల చేసిన మ్యానిఫెస్టోతో రాష్ట్రంలోని ప్రజలకు న్యాయం జరిగేలా ఉంది. సీఎం బహిరంగ సభ ఏర్పాట్లలో మంత్రి మల్లారెడ్డితోపాటు కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు ఉన్నారు.
– శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, విప్