మాదాపూర్, జనవరి 30 : ఇంట్లో అక్రమంగా వైన్ తయారు చేసి విక్రయిస్తున్న కెమికల్ ఇంజినీర్‌ను ఎక్సైజ్ పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన సైదుదేవి సుమన్ కృష్ణ (30) ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అమీన్పూర్లో నివాసముంటున్నాడు. గత కొన్ని రోజులుగా ఇంటివద్ద వైన్ తయారు చేసి విక్రయిస్తున్నాడు.
ఈ నెల 30న మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో చందానగర్ బస్‌స్టాప్ వద్ద ఓ వ్యక్తికి లీటరు వైన్ రూ.850కి విక్రయిస్తుండగా శేరిలింగంపల్లి ఎక్సైజ్ శాఖ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో సోదాలు చేసి 30 లీటర్ల డబ్బాలో 29 లీటర్ల మద్యాన్ని గుర్తించి సీజ్ చేశారు. ఈ దాడుల్లో డీటీఎఫ్ శంషాబాద్ ఎస్సై జి.శ్రీకాంత్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎస్సై శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.