చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 3 : చాంద్రాయణగుట్ట మజ్లిస్ అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ భారీ మెజార్టీతో గెలిచారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి ముప్పిడి సీతారాంరెడ్డిపై ఆయన 81,660 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నిజాం కళాశాలలో ఏర్పాటు చేసిన కౌటింగ్ కేంద్రంలో ఫలితాలను వెల్లడించారు. మొదటి నుంచి అన్ని రౌండ్లలో అక్బరుద్దీన్ ఒవైసీ సత్తాచాటారు. మొత్తం 21 రౌండ్లు ముగిసే వరకు అక్బరుద్దీన్ ఒవైసీకి మొత్తం 99,776 ఓట్లు పోలైయ్యాయి. రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ముప్పిడి సీతారాంరెడ్డికి 18,116 ఓట్లు పోలైయ్యాయి. మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి కౌడి మహేందర్‌కు 16,414 ఓట్లు పోలైయ్యాయి. నాలుగో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి బోయ నాగేశ్ 14, 589 ఓట్లు వచ్చాయి. నోటాకు 1,456 ఓట్లు పోలయ్యాయి.
రాజకీయ కుటుంబ నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చిన అక్బరుద్దీన్ ఒవైసీ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ అడుగుజాడల్లో ముందుకు నడిచారు. మొదటి సారిగా 1999లో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి సమీప అభ్యర్థి,ఎంబీటీ వ్యవస్థాపకుడు అమనుల్లాఖాన్పై గెలిచారు. ఆ తర్వాతజరిగిన ప్రతి ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఇప్పటి వరకు ఐదుసార్లు ఎన్నికైన ఆయన 2023లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు.
చార్మినార్, డిసెంబర్ 3 : శాసనసభ ఎన్నికల్లో ప్రజలు విభిన్నమైన తీర్పునిచ్చారు. ఓ వైపు బీఆర్ఎస్ ప్రభుత్వంపై సానూభూతి ఓట్లతో తమ మద్దతు అందించినా స్థానిక ప్రాభల్యం బహదూర్‌పుర, చార్మినార్ నియోజకవర్గాల్లో ఎన్నికలపై స్పష్టమైన తీర్పు అందించారు. బహదూర్‌ఫుర నియోజకవర్గంలో రెండు డివిజన్లు మినహా మరో 4 డివిజన్లలో ఏకపక్ష ఓటింగ్‌తో ఎంఐఎంకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఓట్లు వేశారు.
బహదూర్‌పురలో ఎంఐఎం, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య చతుర్ముఖ పోటీ ఉన్నా , ఏకపక్షంగా ఎంఐఎంకు విజయాన్ని కట్టబెట్టారు. ప్రజల్లో బీఆర్ఎస్పై ఉన్న సానుభూతి ఒకింత బీఆర్ఎస్ అభ్యర్థి ఇనాయత్‌అలీ బాక్రీకి అందించడంతో ద్వితీయ స్థానంలో నిలిచి ప్రజా మద్దతు కూడగట్టుకున్నారు.
బహదూర్‌ఫుర నియోజకవర్గంలో మొత్తం 3, 16, 666 ఓట్లు ఉండగా అందులో ఎన్నికల సందర్భంగా 1, 44, 094 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారులు 21 రౌండ్లు పాటు ఓట్లను లెక్కించారు. ఎన్నికల అధికారుల ప్రకటన మేరకు ఎంఐఎం అభ్యర్థి మొబీన్ బీఆర్ఎస్ అభ్యర్థి మీర్ ఇనాయత్‌అలీ బాక్రీపై విజయం సాధించారు.పార్టీల వారీగా అభ్యర్థులకు నమోదైన ఓట్లు ఎంఐఎం 89,284, బీఆర్ఎస్ 22,398, బీజేపీ 11,575, కాంగ్రెస్ 13,890.
చార్మినార్ నియోజకవర్గంలో ఎంఐఎం, బీజేపీల మధ్యన ఎన్నికల ఫలితాల్లో నువ్వా నేనా అంటూ హోరాహోరీ సాగింది. చార్మినార్ నియోజకవర్గంలో స్థిరపడిన అగర్వాల్ వర్గం బీజేపీ అభ్యర్థి మేఘారాణికి మద్దతుగా నిలిచారు. ఘాన్సీబజార్, పురానాపూల్ డివిజన్లలో బీజేపీకి అనుకూలంగా ఓట్లు నమోదైనా పత్తర్‌ఘట్టి, శాలిబండ, మొఘల్‌పుర డివిజన్లలో ఎంఐఎంకు ఏకపక్షంగా ప్రజలు మద్దతు తెలిపారు. ఎన్నికల అధికారులు 18 రౌండ్ల పాటు ఓట్లును లెక్కించారు. ఎంఐఎం అభ్యర్థి జుల్ఫీకర్అలీకి 50,101 నమోదు కాగా బీజేపీ అభ్యర్థి మేఘారాణికి 26,249 ఓట్లు రాగా బీఆర్ఎస్కు 8,874 ఓట్లు వచ్చాయి. మరో వైపు కాంగ్రెస్ అభ్యర్థి ముజీబుల్లా షరీఫ్‌కు 10,598 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎంఐఎం అభ్యర్థి మీర్ జుల్ఫీకర్ అలీ తన సమీప బీజేపీ అభ్యర్థి మేఘారాణిపై 23, 852 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకన్న ప్రకటించి సర్టిఫికెట్ అందజేశారు.