మేడ్చల్, ఏప్రిల్18(నమస్తే తెలంగాణ): అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దేనని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్కేసర్లలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశాలను నిర్వహించారు. రజతోత్సవ సభకు సంబంధించిన వాల్‌పోస్టర్లను మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జీ రాగిడి లక్ష్మారెడ్డి, పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి, బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి తదితరులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై ప్రజలు విరక్తి చెందుతున్నారన్నారు. కాంగ్రెస్ మాయమాటలను నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. ఇప్పుడు మళ్లీ కేసీఆర్, కేటీఆరే కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
సీఎంగా కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో ఉంచిన విషయాన్ని ఎమ్మెల్యే మల్లారెడ్డి గుర్తు చేశారు. ఈనెల 27న జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు ఎదరు చూస్తున్నారన్నారు. సభకు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.