సిటీబ్యూరో, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మహిళా పోరాట శక్తికి ప్రతీక అని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట అన్నారు. చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకొని గురువారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కమిషనర్ ఆమ్రపాలి పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ భూమికోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిన వీర వనిత అని, రైతాంగ పోరాటానికి ఊపిరి పోసిన యోధురాలని కొనియాడారు. ఐలమ్మ చూపిన తెగువ, శౌర్యం, ధైర్యం ప్రతి ఒక్కరిలో ప్రేరణ కల్పించిందనిఅన్నారు. ఆమె ఆశయాలకు అనుగుణంగా పేదల అభ్యున్నతి కోసం అందరూ పనిచేయాలని ఆమ్రపాలి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్లు రఘుప్రసాద్, యాదగిరిరావు, సీసీపీ శ్రీనివాస్, ఏసీపీ సుదర్శన్, డాక్టర్ రాంబాబు, సీపీఆర్ఓ మహ్మద్ ముర్తుజా అలీ, ఓఎస్డీ వేణుగోపాల్, ఏఎంసీ శారద, రమణ తదితరులు పాల్గొన్నారు.