అంబర్పేట, డిసెంబర్ 26 : వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి తెలంగాణలో ఉన్న ఏపీజీవీబీ బ్యాంకు శాఖలన్నీ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనమవుతున్నాయని తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్మన్ వై.శోభ తెలిపారు. గ్రామీణ బ్యాంకులను పటిష్టపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రం-ఒక గ్రామీణ బ్యాంకు అనే ప్రతిపాదనను తీసుకొచ్చిందన్నారు. ఈ మేరకు గురువారం నల్లకుంటలోని బ్యాంకు కేంద్ర కార్యాలయంలో జీఎం ఆపరేషన్స్ తమ్మన సుధాకర్, జీఎం అడ్మిన్ టి.చంద్రశేఖర్, జీఎం ఐటీ కె.లక్ష్మి, జీఎం విజిలెన్స్ టి.భారతి తయార్, జీఎం కంప్లీయన్స్ డి.రమేశ్, ఏజీఎం పర్సనల్ సుశాంత్కుమార్తో కలిసి చైర్మన్ శోభ విలీననానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలు అందిస్తున్నదన్నారు. ఏపీజీవీబీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో మొత్తం 771 శాఖల్లో సేవలందిస్తున్నదని చెప్పారు. విలీనం తర్వాత తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం 435 శాఖలతో రూ.30వేల కోట్ల వ్యాపారం కలిగి 18 జిల్లాల్లో సేవలందిస్తున్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు.. విలీనం తర్వాత 928 శాఖలు, రూ.70వేల కోట్ల వ్యాపారం విలువ కలిగి దేశంలోని అతి పెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా నిలువనుందని పేర్కొన్నారు.
విలీనం కారణంగా బ్యాంకు కార్యకలాపాలు, ఆన్లైన్ సేవలైన యూపీఐ, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఖాతాదారుల సేవా కేంద్రాల్లో లభించే అన్ని బ్యాంకింగ్ సేవలకు ఈ నెల 28 నుంచి 31 వరకు అంతరాయం కలుగుతుందని, ఖాతాదారులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామన్నారు. అయితే ఖాతాదారుల అవసరాల దృష్ట్యా ఈ నెల 30, 31వ తేదీల్లో అత్యవసర పరిస్థితుల్లో రూ.5వేల వరకు నగదు విత్డ్రా చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నామని వెల్లడించారు. జనవరి ఒకటో తేదీ నుంచి తిరిగి అన్ని రకాల సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏపీజీవీబీ శాఖలకు చెందిన ఖాతాదారులు వారి ఏటీఎం కార్డులు మార్చుకొనుటకు, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల్లో తిరిగి నమోదు చేసుకొనుటకు జనవరి ఒకటో తేదీ నుంచి వారి బ్యాంకులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. మొబైల్ బ్యాంకింగ్ ఖాతాదారులు ప్లేస్టోర్ లేదా ఆపిల్ స్టోర్ నుంచి మొబైల్ బ్యాంకింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల కోసం బ్యాంకు వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. ఏపీజీవీబీ ఖాతాదారుల వద్ద ఇప్పటికే ఉన్న పాత చెక్కులు, డీడీలు ఈ నెల 31 వరకు చెల్లింపులకు క్లియరింగ్ సేవలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. చెక్ బుక్ ఉన్న ఏపీజీవీబీ ఖాతాదారులు వారి చిరునామాకు నూతన చెక్ బుక్కులు పోస్టు ద్వారా పంపబడతాయని, వీటిని జనవరి ఒకటో తేదీ నుంచి వినియోగించుకోవచ్చన్నారు. ఈ మార్పుతో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయని ఆశిస్తున్నట్లు వివరించారు.