చిక్కడపల్లి, మే 29: కేంద్ర ప్రభుత్వానికి పౌర హక్కులపై విశ్వాసం లేదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. రాజ్యాంగం రాసిన సమయంలో కూడా వీరంతా తిరస్కరించారని గుర్తి చేశారు. తెలంగాణ పౌర హక్కుల సంఘం రెండో మహాసభలు ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. పౌర హక్కుల సంఘం ఆరుగురిని కోల్పోయిందన్నారు. దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
చలన చిత్ర రంగానికి చెందిన వారికి స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. 1930లో జర్మనీలో జరిగినట్లు ఈ రోజు దేశంలో జరుగుతున్నదని అన్నారు. పౌర హక్కుల సంఘాల బాధ్యత మరింత పెరిగిందన్నారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు క్రాంతి చైతన్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకుడు నారాయణ రావు, పీయూడీఆర్ నాయకులు అశీష్గుప్త, చంద్రశేఖర్, ఎపీడీఆర్ నాయకుడు తపస్ చక్రవర్తి, ఏఎఫ్డీఆర్ నాయకుడు ప్రీత్పాల్ సింగ్, లిక్స్, గోపాల్, విమలక్క తదితరులు పాల్గొన్నారు.