Swachh Survekshan | సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలుస్తుందా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంతో వచ్చిన ర్యాంకుల కంటే మెరుగైన ఫలితాలను రాబడుతుందా? ప్రస్తుత పారిశుధ్య నిర్వహణలో క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తుంటే.. అనేక అనుమానాలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొన్ని రోజులుగా కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాలు నగరంలో సర్వే చేస్తున్నాయి. మరో ఐదు రోజుల్లో సర్వే ప్రక్రియను ముగించుకుని ఢిల్లీకి వెళ్లనున్నది. అయితే పారిశుధ్య నిర్వహణపై క్షేత్రస్థాయి పర్యటనలో స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. పబ్లిక్ టాయిలెట్ల విషయంలోఎంపిక ప్రాంతాల్లోనే తిప్పుతున్న జీహెచ్ఎంసీ అధికారుల తీరును తప్పుపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం వాటర్ ప్లస్ కేటగిరీలో ఈ బృందం సర్వే జరుపుతున్నది. మరోవైపు పారిశుధ్య నిర్వహణలో హైదరాబాద్‌కు మార్కులు అశించిన స్థాయిలో రావడం కష్టమేనన్న చర్చ జరుగుతున్నది.
స్వచ్ఛ సర్వేక్షణ్-2024 ర్యాంకుల ప్రకటన, సర్వే ప్రక్రియ ప్రారంభమవుతున్న తరుణంలో జీహెచ్ఎంసీ అధికారుల్లో గుబులు మొదలైంది. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా కీలక నగరాలకు ర్యాంకులను ప్రకటిస్తూ వస్తున్నది. 2015 నుంచి 2023 వరకు 10 లక్షల జనాభా కంటే ఎక్కువ సిటీ జాబితాలో హైదరాబాద్ మెరుగైన ర్యాంకింగ్ సాధించింది . 2023 సంవత్సరానికి సిటీ 9వ ర్యాంకు, భారతదేశంలో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన చెత్త రహిత నగరంగా హైదరాబాద్‌కు అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలోనే నగరంలో ప్రస్తుత సర్వే బృందం స్వచ్ఛ సర్వేక్షణ్-2024పై సర్వే ప్రారంభించింది. వచ్చే నెలలో ర్యాంకుల జాబితాను కేంద్రం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
కేంద్రం నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాలు వచ్చి నగరంలోని టాయిలెట్లను పరిశీలించింది. అయితే అధికారులు మాత్రం వారిని తప్పుదోవ పట్టించి శుభ్రంగా ఉన్న టాయిలెట్ల దగ్గరకు తీసుకువెళ్లి చూపించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. 10 రోజుల స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో భాగంగా నగరానికి వచ్చిన కేంద్ర బృందం టాయిలెట్ల శుభ్రత, వినియోగం, నిర్మాణ నాణ్యతను చెక్ చేస్తున్నది. వీటితో పాటు గ్రేటర్లో పలు చోట్ల లూ కేఫ్‌లకు తాళాలు వేస్తూ దర్శనమిస్తున్నాయి.