చేవెళ్ల రూరల్/ చేవెళ్ల టౌన్, నవంబర్ 25 : సెంట్రింగ్ బాక్సులు, జాకీలు, రాడ్స్‌ను దొంగతనం చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను చేవెళ్ల పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం చేవెళ్ల పీఎస్‌లో సీఐ భూపాల్ శ్రీధర్, డిటెక్టివ్ సీఐ రమేశ్ నాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. ముషీరాబాద్ పరిధి.. గోలక్‌పూర్‌లోని గుల్షన్ నగర్‌కు చెందిన మోసిన్ అహ్మద్ స్రాప్ (చెత్త )వ్యాపారం చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఎలాగైనా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 17 మంది లేబర్లతో ముఠా ఏర్పాటు చేసి వారికి వెహికల్(టాటా ఏస్)ను కూడా సమకూర్చాడు.
వీళ్లు ఉదయం పూట నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద రెకీ నిర్వహించి రాత్రి వేళల్లో సెంట్రింగ్ బాక్సులు, జాకీలు, రాడ్స్ దొంగిలించి మోసిన్ అహ్మద్‌కు అప్పజెప్పేవాళ్లు. ఇందుకు వారికి ఆయన డబ్బులు ఇచ్చేవారు. ఇలా సంగారెడ్డి, మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలోనూ దొంగతనం చేశారు. గత ఆరేడు నెలల్లోనే వీరిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో 6 కేసులు, మొయినాబాద్ పీఎస్‌లో 3, శంకర్‌పల్లిలో 1, మోకిల పీఎస్‌లో 1 కేసు నమోదైంది. దీంతో వీరిపై నిఘా పెట్టిన పోలీసులు ఈ నెల 9న చేవెళ్ల మండలం ముడిమ్యాల గేట్ దగ్గర నిర్మాణంలో ఉన్న భవనం యజమానులు రిజ్వాన్, అహ్మద్ కలిసి నిందితులను పట్టుకునేందుకు ప్లాన్ వేశారు.
ఇందులో భాగంగానే అదే రోజు రాత్రి అకడే రెకీ నిర్వహించారు. అనుమానించినట్టుగానే ఏడుగురు నిందితులు మహమ్మద్ రహిమాన్, ఆర్బాజ్, ఆయాజ్, షకీల్, గౌస్ అలీ, కలీముద్దీన్, అన్సార్ అలీ, అకడికి రాగా.. పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిని పట్టుకునే క్రమంలో ఇద్దరి పై దాడి చేశారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. ప్రధాన నిందితుడు మోసిన్ అహ్మద్ పేరు చెప్పడంతో ఆయనను కూడా అరెస్ట్ చేసి 8 మందిని కోర్టులో హాజరు పరిచారు. కోర్డు ఆదేశాల మేరకు మళ్లీ పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించగా.. బాక్సులు ఉంచిన స్థలంతో పాటు మిగితా నిందితుల సమాచారం ఇచ్చారు.
దీంతో 11 కేసులకు సంబంధించి 4,566 సెంట్రింగ్ బాక్సులు దొంగతనం చేయగా.. ముషీరాబాద్ ఓపెన్ ప్లేస్‌లో ఉంచిన రూ.25 లక్షల విలువైన 3,732 బాక్సులు స్వాధీనం చేసుకున్నామని సీఐ వివరించారు. అనంతరం వీరిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ చేశామని, మరో 10 మంది నిందితులు అల్తాఫ్, ఇమ్రాన్, అఖిల్ బాజ్‌పేయి, బజాల అలీ, అజీజ్ అలీ, అర్వాజ్, రిజ్వాన్, బాసిమ్ ఖాన్, నన్నే, ఖలీద్ పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ కేసుకు సంబంధించిన సంగారెడ్డి, మేడ్చల్ పోలీసులకు ఇప్పటికే సమాచారం ఇచ్చామని, యూపీ పోలీసులకు కూడా సమాచారం ఇస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్సైలు శ్రీకాంత్ రెడ్డి, సంతోష్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.