ఉప్పల్, జూలై 17: కాప్రా సర్కిల్ పరిధిలో వర్షాకాలంలోనూ జోరుగా సెల్లార్ల తవ్వకాలు చేపడుతున్నారు. ప్రధాన రహదారుల్లో సెల్లార్లు తవ్వుతున్నా అధికారులకు మాత్రం కనిపించకపోవడం గమనార్హం. వర్షాలు పడుతుండటంతో సెల్లార్లలో నీరు చేరింది. దీంతో దోమలు వ్యాప్తి చెంది, సమీప కాలనీలవాసులకు ప్రమాదకరంగా మారింది. నీటి గుంతలు ప్రమాదాలకు నెలవు కానున్నాయి.
చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వీటిపై దృష్టి సారించడంలేదు. నాచారం ప్రధాన రహదారిని సీఎస్ బ్రదర్స్ పక్కనే సెల్లార్ కోసం పనులు ప్రారంభించినా కాప్రా సర్కిల్ సిబ్బంది పట్టించుకోవడంలేదు. ఏఎస్‌రావునగర్, మల్లాపూర్ ప్రధాన రహదారిలోని సెల్లార్ నిర్మాణాలపై దృష్టిసారించి చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది.
ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో సెల్లార్ నిర్మాణాల కోసం తవ్వకాలు చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలను అరికట్టాల్సిన ఉప్పల్ సర్కిల్ అధికారులు చర్యలు చేపట్టడంలేదు. నిర్మాణాలు పూర్తి చేసేవరకు చూసి, ఆ తర్వాత నోటీసులు అందించి వదిలేస్తున్నారు. ఉప్పల్ భగాయత్‌లో కమర్షియల్ నిర్మాణాలు జరుగుతున్నా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవంలేదు. ఎలాంటి ట్యాక్స్ వేయకుండా, చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.