ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 8: జల్సాలకు అలవాటుపడి, సులువుగా సొమ్ము సంపాదించేందుకు సెల్‌ఫోన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న రెండు ముఠాలకు చెందిన ఏడుగిరిని పోలీసులు అరెస్టు చేశారు. ఓయూ పోలీస్ స్టేషన్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌జోన్ డీసీపీ రావుల గిరిధర్, ఏసీపీ గ్యార జగన్ వివరాలను వెల్లడించారు. ఛత్రినాక గౌలిపురకు చెందిన కంసాల అరుణ్‌కుమార్ అలియాస్ నాని పాత నేరస్తుడు. సెల్‌ఫోన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలకు పాల్పడి పలుమార్లు జైలుకు వెళ్లాడు. ఇతడిపై మొఘల్‌పుర, ఫలక్‌నుమా, అబిడ్స్, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లలో ఆరు కేసులు ఉన్నాయి.
సరూర్‌నగర్‌లో నివాసముంటున్న నాని అదే ప్రాంతానికి చెందిన తుస్మద్ స్నేహ అలియాస్ నిక్కు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సులువుగా డబ్బు సంపాదించేందుకు తన భార్యతో పాటు చాదర్‌ఘాట్‌కు చెందిన పనగంటి రఘుబాబు, మరో మైనర్‌తో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. మల్కాజిగిరి వసంతపురి కాలనీకి చెందిన డెకరేషన్ పనులు చేసే బూస శాంసన్ అలియాస్ టింకు, అదే ప్రాంతానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి కొణిపాక ప్రశాంత్ అలియాస్ చింటు, లాలాగూడ శాంతినగర్‌కు చెందిన మల్తుంకార్ మధు మరో ముఠాగా ఏర్పడి సెల్‌ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు.
ఈ రెండు ముఠాలు ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్నవారు, ఒంటరిగా వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని సెల్ఫోన్లు దొంగలించి ఉడాయించేవారు. ఆ ఫోన్లను మహమ్మద్ ఉరఫ్ , ఇలియాస్ అఫ్రోజ్, షేక్ అలీ, రాజులకు అతి తక్కువ ధరకు విక్రయించి వచ్చిన సొమ్మును అందరూ సమానంగా పంచుకుని, జల్సాలు చేసేవారు. ఈ క్రమంలో పోలీసులు డెకాయిట్ ఆపరేషన్ చేసి, రెండు ముఠాలను పట్టుకుని, రిమాండ్‌కు తరలించారు. మొత్తం 22 సెల్ఫోన్లు, నాలుగు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.