ఎల్బీనగర్ , మే 22 : వెయ్యేళ్ల చరిత్ర కల్గిన ఫణిగిరి కొసగుండ్ల లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయంలో బుధవారం స్వామి వారి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. మూసీనది ప్రక్కన చైతన్యపురి ఫణిగిరి కాలనీలో స్వయంభువుగా వెలసిన లక్ష్మీనర్సింహ స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. స్వామి వారి జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 7 గంటలకు క్షీర పంచామృతాభిషేకం, కుంభం, నర్సింహా జ్యోతి, ఉదయం 9 గంటలకు సమస్త పీడా నివారణ పూజలు, సుదర్శన హోమం కార్యక్రమాలు నిర్వహించారు.
సుమారు 5 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని ఆలయ కమిటీ తెలిపింది. గురువారం ఉదయం 11 గంటలకు లక్ష్మీనర్సింహ స్వామి వారి కల్యాణ వేడుకలను ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కుందూరు కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కల్యాణం కోసం యాదగిరి గుట్ట నుంచి తలంబ్రాలు, పట్టు వస్ర్తాలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కుందూరు కృష్ణారెడ్డి, ప్రభు, నరేందర్రెడ్డి, సుధాకర్ గుప్త, అశోక్, బీజేపీ నాయకులు వినోద్ యాదవ్, రాకేశ్, రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు.