సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి క్రిస్మస్ వేడుకల నిర్వహణపై నగరంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని పండుగలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారని వివరించారు.
ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. క్రిస్మస్ ను పేదలు కూడా సంతోషంగా జరుపుకోవాలనే ఆలోచనతో పేదలకు ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్‌లు (దుస్తులు) పంపిణీ చేస్తున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో విందును ఏర్పాటు చేస్తామని, ఈ విందుకు సీఎం కేసీఆర్ హాజరవుతారని చెప్పారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల సహకారంతో చర్చి కమిటీ ప్రతినిధులతో సమావేశాలను నిర్వహించి డిన్నర్, గిఫ్ట్‌ప్యాక్‌ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇందుకోసం ఒకో నియోజకవర్గంలో ఒకో ప్రాంతానికి 500 చొప్పున గిఫ్ట్ ప్యాక్‌లు, డిన్నర్ నిర్వహణ కోసం లక్ష రూపాయలు చొప్పున అందించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో మండలిలో ప్రభుత్వ విప్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీలు స్టీఫెన్ సన్, సురభి వాణీదేవి, హసన్ జాఫ్రీ, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, కౌసర్ మొహినోద్దిన్, టీఎస్‌ఈడబ్ల్యూఐసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ క్రాంతి వెస్లీ, ప్రాజెక్ట్ డైరెక్టర్ సౌజన్య పాల్గొన్నారు.