Inter Exams | సిటీబ్యూరో, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ): మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ, జిల్లాలో ని 1,79,218 మంది విద్యార్థులకు 244 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
వారిలో ప్రథమ సంవత్సర విద్యార్థులు 85,753 మంది. కాగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 93,465 మంది ఉన్నారని చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించే పరీక్షలకు ట్రాఫిక్ దృష్ట్యా విద్యార్థులు ఉదయం 8 గంటల వరకే కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. సంబంధిత అధికారులు కేటాయించిన విధులను అత్యంత జాగ్రత్తతో అప్రమత్తంగా నిర్వహించాలని, ప్రశ్నాపత్రాల తరలింపులో పోలీసులు అత్యంత బాధ్యత, భద్రత పాటించాలని ఆదేశించారు.
విద్యార్థులు సమయానుకూలంగా పరీక్షా కేంద్రాలకు చేరే విధంగా ఆర్టీసీ బస్సులు నడపాలని, నిరంతరం పరీక్షా కేంద్రాల్లో విద్యుత్తు సరఫరాకు చర్యలు తీసుకోవాలని, తాగునీరు, శానిటేషన్ తో పాటు అన్ని పరీక్షా కేంద్రాల్లో వైద్య సౌకర్యాలు కల్పించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచనల మేరకు నిర్దేశించిన సమయానికి అన్ని కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నం. 040 29700934 లో సంప్రదించాలన్నారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి డి. ఒడ్డెన్న, ఏసీపీ భాస్కర్, ఆర్ ఎం బాబూ నాయక్, జిల్లా వైద్య అధికారి జె. వెంకటి, పోస్టల్ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.