సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): యశోద ఆస్పత్రి గ్రూప్స్‌కు సంబంధించిన రూ.3.26 కోట్లు పక్కా ప్లాన్‌తో దుర్వినియోగం చేసిన అకౌంట్స్ మేనేజర్, ఆయన భార్యతో పాటు మరికొందరిపై సీసీఎస్‌లో కేసు నమోదైంది. యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (వైఎస్ఎస్హెచ్), యశోద హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (వైహెచ్ఎస్పీఎల్) యశోద గ్రూప్‌లో ఉన్నాయి. ఈ సంస్థల కార్పొరేట్ కార్యాలయం నాగార్జున్ హిల్స్‌లో ఉంది. కాగా, వైహెచ్ఎస్పీఎల్లో బాచుపల్లి నివాసి రామ్‌నర్సింగ్ 2020లో అకౌంట్స్ మేనేజర్‌గా చేరాడు. యశోద గ్రూప్స్‌కు సంబంధించిన సిబ్బంది జీతభత్యాలు, బ్యాంకు ఖాతాల వ్యవహారాన్ని చూసుకున్నాడు.
రామ్‌నర్సింగ్ ఆయన భార్య కామేశ్వరితో పాటు ప్రవీణ, శ్రీరామ్మూర్తి బ్యాంకు ఖాతాలను యశోద గ్రూప్స్ నుంచి జీతాలు ఇచ్చే బ్యాంకు ఖాతాలోని బెనిఫిషియరీ లిస్ట్‌లో చేర్చాడు. ఉద్యోగుల లిస్టులలో లేని ఈ నాలుగు ఖాతాలకు ప్రతి నెల లక్షల రూపాయలు బదిలీ చేశాడు. 2021 మే నుంచి సెప్టెంబర్ 2023 వరకు రూ. 3.26 కోట్లు పక్కదారి పట్టించి, భారీగా ఆస్తులు కొనుగోలు చేశాడు. రామ్‌నర్సింగ్ 2023, నవంబర్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయాడు. 2024లో రికార్డులను పరిశీలించగా ఈ మోసం బయటపడింది. యశోద గ్రూప్ ఫైనాన్స్ కంట్రోలర్ ముఖేశ్ కుమార్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.