సిటీబ్యూరో, జనవరి 25 ( నమస్తే తెలంగాణ ) : ఒకే దేశం.. ఒకే ఐడీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అపార్( ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రి) జారీ ప్రక్రియ హైదరాబాద్ జిల్లాలో నత్తనడకన సాగుతున్నది. ఈనెల 31 వరకు వివరాలు అందించాలని విద్యాశాఖ ఇప్పటికే స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది. కానీ అపార్ నమోదులో టీచర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థుల పేర్లు పాఠశాల రికార్డుల్లో ఒక విధంగా ఆధార్ కార్డుల్లో మరో విధంగా ఉంటే వెబ్సైట్ వాటిని తీసుకోవట్లేదు. దానిని పరిష్కరించేందుకు టీచర్లు జనన ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని కోరుతున్నారు. అందులో ఏవైనా తేడాలుంటే ఐడీ క్రియేట్ చేయడం సాధ్యం కావట్లేదు.
ఆధార్ తీసుకునే సమయంలో చాలా తప్పులు దొర్లుతున్నాయి. పుట్టిన తేదీల్లోనూ తప్పులను నమోదు చేశారు. ఇప్పుడు వాటిని సరిదిద్దడం స్కూలు యాజమాన్యాలకు తలకు మించిన భారంగా మారింది. హైదరాబాద్‌లో 3122 స్కూళ్లు ఉన్నాయి. 10,10,550 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికీ 2.66 లక్షల విద్యార్థులకు మాత్రమే అపార్ ఐడీ జనరేట్ అయినట్టు అధికారులు తెలిపారు. చాలా స్కూళ్లకు ఇప్పటికీ అపార్ ప్రక్రియనే మొదలుపెట్టలేదు. దీంతో ఇప్పడు ఈనెల 31 వరకు గడువు సమీపిస్తుండటంతో ప్రైవేటు పాఠశాలలు, సర్కారీ స్కూళ్లు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం పంపించారు. అపార్ ఐడీకి సంబంధించిన ఆధార్, డిక్లరేషన్ ఫారం ఇవ్వాలని సూచించారు.
అయితే ఇప్పుడు తమ పిల్లల ఆధార్ కార్డుల్లో, స్కూల్ రిజిస్టర్లో ఉన్న పేర్ల మధ్య వ్యత్యాసాలు ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రక్రియలో విద్యార్థుల పేర్లల్లో మార్పులు, చేర్పులు ఉంటే డిప్యూటీ ఐఓఎస్ ఆధ్వర్యంలో చేయనున్నారు. అయితే ఈ ప్రక్రియ కాస్త ఆలస్యంగా సాగనున్నది. సరైన సమాచారం ఇస్తేనే విద్యార్థులకు అపార్ ఐడీ జనరేట్ అవుతుందని అధికారులు తెలిపారు. ఏమైన మార్పులు, చేర్పులు ఉంటే ఐడీ జనరేట్ కాదని, తర్వాత పరిశీలిస్తామని వివరించారు. కాగా, జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)-2020లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అపార్ ఐడీ తీసుకొచ్చింది. అపార్ కార్డుపై 17 అంకెల యూనిక్ నంబర్‌తో పాటు క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇందులో విద్యార్థికి సంబంధించిన సంక్షిప్త సమాచారం ఉంటుంది.
ప్రతి విద్యార్థి యొక్క పూర్తి సమాచారం డిజిటల్ రూపంలో అపార్ కార్డులో సేవ్ చేయబడుతుంది. విద్యా నాణ్యతతో పాటు క్రీడా నైపుణ్యాలను కూడా నమోదు చేస్తారు. విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు మారే క్రమంలో ఈ అపార్ కార్డు ఉపయోగపడుతుంది. వివిధ పాఠశాలల్లో అడ్మిషన్ల నుంచి ఉద్యోగాల పొందే వరకు అపార్ కార్డు కేంద్రంగానే సాగుతుందని అధికారులు తెలిపారు.