ఖైరతాబాద్: పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యోందంపై సీబీఐతో విచారణ జరిపించాలని వక్తలు డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం మీడియా సమావేశంలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మాట్లాడుతూ… ప్రవీణ్ పగడాల మరణం సాధారణమైంది కాదని, అది ముమ్మాటికీ హత్యేనన్నారు.
ఆయన మరణించి మూడు రోజులు గడిచినా ఇంత వరకు పోస్టుమార్టం రిపోర్టు రాలేదన్నారు. నిజం కోసం కొట్లాడుతున్న న్యాయవాది ఇజ్రాయల్‌ను సైతం హత్య చేశారని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాలక ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. విశ్రాంత డీజీపీ బాబురావు మాట్లాడుతూ ప్రవీణ్‌ది ప్రమాదమా, లేక హత్య అనేది తేలాల్సి ఉందని, కాని 90 శాతం మంది ఇది హత్యేనని భావిస్తున్నారన్నారు.
కొంత కాలం నుంచి ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారని, ప్రవీణ్ పగడాల, ఆయన కుటుంబ సభ్యుల కాల్ డేటా వివరాలను పోలీసులు సేకరించి విచారణ చేపట్టాలన్నారు. కావేటి లా ఫర్మ్ ప్రతినిధి న్యాయవాది రాజేందర్, జేరుషలేం మత్తయ్య పాల్గొన్నారు.