ATM Cash custodian | సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఏటీఎంలలో క్యాష్ డిపాజిట్ చేయాల్సిన క్యాష్ కస్టోడియన్లు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వీరి నేరాలు ఆయా సంబంధితన సంస్థల అంతర్గత ఆడిటింగ్‌లో వెలుగు చూస్తున్నాయి. దీంతో క్యాష్ మేనేజ్మెంట్ సంస్థలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేస్తున్నారు. తమ మోసం బయటపడిందని గ్రహించిన కొంతమంది క్యాష్ కస్టోడియన్లు ఆడిటింగ్ జరుగుతున్న సమయంలోనే ఉద్యోగాలు విడిచి పారిపోతున్నారు. కొంతమందిని పోలీసులు అరెస్టు చేసి, నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. రెండేండ్లకు ముందు ఇలాంటి ఘటనలపై నగరంలోని పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పలువురు క్యాష్ కస్టోడియన్లను కూడా పోలీసులు అరెస్టుచేశారు. రెండేళ్ల తర్వాత ఈ తరహా కేసులు ఇటీవల తిరిగి వెలుగుచూస్తున్నాయి.
క్యాష్ మేనేజ్మెంట్ ద్వారా..
క్యాష్ మేనేజ్మెంట్ సంస్థలు ఆయా బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకొని.. ఆయా బ్యాంకుల ఏటీఎం యంత్రాలలో నగదును డిపాజిట్ చేస్తుంటారు. ఒక్కో రూట్లో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసి, ఏటీఎం యంత్రాల్లో క్యాష్ డిపాజిట్ చేయిస్తారు. ఈ టీమ్‌లో సెక్యూరిటీతో పాటు క్యాష్ డిపాజిట్ చేసేందుకు ఇద్దరు వ్యక్తులను నియమించుకుంటారు. వారి వద్దనే ఏటీఎం పాస్వర్డ్, ఏటీఎం తాళాలు కూడా ఉంటాయి.
నేరాలు ఇలా చేస్తున్నారు..
కొంతమంది క్యాష్ కస్టోడియన్లు ఏటీఎం యంత్రాల్లో తక్కువ నగదు డిపాజిట్ చేసి, రికార్డుల్లో మాత్రం ఎక్కువ చూపిస్తున్నారు. మరికొన్నిసార్లు అందరితోపాటు వెళ్తున్నారు. పెద్ద మొత్తంలో క్యాష్ డిపాజిట్ చేస్తున్నారు. అందరు వెళ్లిన తరువాత.. తిరిగి ఏటీఎం సెంటర్‌కు వెళ్లి కొంత నగదు బయటకు తీస్తున్నారు. ఇలాంటి ఘటనలపై రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఇటీవల కేసులు నమోదయ్యాయి. ఈ సంఘటనలతో క్యాష్ మేనేజ్మెంట్ సంస్థలు ఇప్పుడు మరింత అప్రమత్తమయ్యాయి. సంస్థలో పనిచేసే క్యాష్ కస్టోడియన్లపై నిఘా పెట్టి, ఎప్పటికప్పుడు అంతర్గత ఆడిటింగ్లు చేపట్టారు.
క్యాష్ కస్టోడియన్ అరెస్ట్
వరంగల్, మొగిలిచర్ల గ్రామానికి చెందిన పత్రి ప్రణయ్ కుమార్ గత రెండేండ్లుగా సికింద్రాబాద్‌లోని సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ్, క్యాష్మేనేజ్మెంట్ సంస్థలో క్యాష్ కస్టోడియన్‌గా పనిచేస్తున్నాడు. ఉప్పల్ రూట్లోని ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం కేంద్రాల్లో ప్రణయ్, శ్రీనివాస్ కలిసి క్యాష్ డిపాజిట్ చేస్తుంటారు. ఇక్కడి ఏటీఎం తాళాలు ప్రణయ్ వద్ద ఉండగా, దాని పాస్వర్డ్ శ్రీనివాస్ వద్ద ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రణయ్ పాస్వర్డ్ తెలుసుకొని, శ్రీనివాస్ లేని సమయంలో పీర్జాదిగూడలో రెండు, బండ్లగూడలో ఒకటి, జిల్లెలగూడలో రెండు ఏటీఎం కేంద్రాల నుంచి రూ. 62.79 లక్షల నగదు అపహరించాడు. ఇటీవల సంస్థ నిర్వహించిన ఆడిటింగ్‌లో ఈ విషయం బయటపడింది. క్యాష్ కస్టోడియన్ నిర్వాహకులు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రణయ్, అతడికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, రూ. 55.80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ లిమిటెడ్ సంస్థ క్యాష్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఇందులో భాగంగా బ్యాంకుల నుంచి నగదు తెచ్చి, ఆయా బ్యాంకు ఏటీఎంలలో డిపాజిట్ చేసే బాధ్యతను క్యాష్ కస్టోడియన్లు చూసుకుంటారు. ఈ క్రమంలో క్యాష్ కస్టోడియన్లు అయిన సాయిరాజ్, శ్రీనివాస్ 33 ఏటీఎం కేంద్రాల నిర్వహణ చూసుకుంటుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన ఇంటర్నల్ ఆడిట్ జరిగింది. ఈ ఆడిట్లో హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన రెండు ఏటీఎం సెంటర్లలో రూ. 31,87,300 నగదు తక్కువ వచ్చింది. ఈ ఆడిటింగ్‌కు సాయిరాజ్ డుమ్మా కొట్టాడు. దీంతో సదరు సంస్థ దీనికి బాధ్యులైన సాయిరాజ్, శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆడిటింగ్‌లో వీరి మోసాలు మరిన్ని బయటపడే అవకాశాలున్నాయి.