Wrong Route Driving | సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ): రాంగ్ రూట్ వెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్తా…! ఇక నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకు పంపుతారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులే ఉండటంతో ట్రాఫిక్ నియమాలను మరింత కఠినంగా అమలు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే మొదటి సారిగా రాంగ్ రూట్లో ప్రయాణించే వాహనదారులపై 336 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మొదలు పెట్టారు సైబరాబాద్ పోలీసులు. రాంగ్రూట్లో వచ్చి పట్టుబడిన వారిపై సంబంధిత లా అండ్ ఆర్డర్ ఠాణాలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చార్జీషీట్ దాఖలు చేస్తారు.
శుక్రవారం ఒక్కరోజే కమిషనరేట్ పరిధిలో రాంగ్‌రూట్ వాహనాలు నడిపిన 93 మందిని గుర్తించి కేసులు నమోదు చేశారు. అందులో 11 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. స్టేషన్ల వారీగా పరిశీలిస్తే గచ్చిబౌలి పీఎస్ పరిధిలో అత్యధికంగా 32 మంది రాంగ్రూట్లో ప్రయాణిస్తూ పట్టుపడ్డారు. వారిలో నలుగురిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలో ఐదు మంది పట్టుబడగా, వారిలో ఒకరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కూకట్పల్లి పరిధిలో ముగ్గురు పట్టుబడగా, వారిలో ఒకరిపై, మాదాపూర్‌లో ఆరు మంది పట్టుబడగా, వారిలో ఒకరిపై, నార్సింగి ఠాణా పరిధిలో 11 మంది పట్టుబడగా, వారిలో ఒకరిపై, రాయదుర్గం పరిధిలో 20 మంది పట్టుబడగా, వారిలో ఇద్దరిపై, జీడిమెట్ల పరిధిలో 16 మంది పట్టుబడగా, వారిలో ఒకరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
– జాయింట్ సీపీ(ట్రాఫిక్) జోయల్ డేవిస్
రాంగ్రూట్లో ప్రయాణించడం వల్ల రాంగ్‌సైడ్ వచ్చే వాహనదారులకే కాకుండా ఇతర వాహనదారులు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. రాంగ్‌సైడ్ డ్రైవింగ్ చాలా ప్రమాదకరం. జరిమానాలు వేసినా నిబంధనల ఉల్లంఘనులు తగ్గడం లేదు. అందుకని రాంగ్ రూట్ డ్రైవింగ్‌కు పాల్పడే వాహనదారులపై సెక్షన్ 336 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాం. ఈ కేసుల్లో మూడేండ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడవచ్చు.
రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇంతకుముందు లేదు. మొదటిసారిగా గత నెలలోనే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాం. గత నెలలో కమిషనరేట్ పరిధిలో మొత్తం 250 వాహనాలపై కేసులు పెట్టాం. కమిషనరేట్ పరిధిలో తరచూ ఎక్కువగా రాంగ్‌రూట్ వెళ్లేందుకు అవకాశాలున్న 124 ప్రాంతాలను గుర్తించాం. ఈ ప్రాంతాల్లో ఏఎన్పీఆర్ కెమెరాలు అమరుస్తున్నాం. ఈ కెమెరాలు రాంగ్‌రూట్ వెళ్లే వారిని గుర్తించి ఫొటోలు తీస్తాయి. వాటి ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తాం.