Hyderabad | సిటీబ్యూరో, జనవరి 1(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో భౌతిక దాడులు (బాడీ అఫెనెన్స్ కేసులు) భారీగా పెరిగాయి. 65 శాతం వరకు ఈ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. హత్యలు, దాడులు, కిడ్నాప్‌లు నగరంలో ఎక్కువగా చోటు చేసుకోవడంతో శాంతి భద్రతలను ప్రశ్నిస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో నేరాలు పెరిగిపోవడం అన్ని రకాలుగా ప్రభావం చూపుతున్నది. టెక్నాలజీని ఉపయోగిస్తూ నేరాలను తగ్గించేందుకు పనిచేసిన అదే పోలీసులు ప్రభుత్వం మారగానే ఆ టెక్నాలజీని ఎక్కువగా వాడకుండా చేతులెత్తేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఆ టెక్నాలజీని పర్యవేక్షించే వారు సరిగ్గా లేకపోవడంతో వ్యవస్థ అంతా కుప్పకూలిపోయినట్లుగా మారుతుందని చర్చించుకుంటున్నారు. రౌడీషీటర్లు రెచ్చిపోతూ దాడులు, హత్యలు చేయడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంట వెంటనే హత్యలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహించారనే వాదన విన్పిస్తున్నది. ఒక పక్క రౌడీషీటర్ల హల్చల్ చేస్తే ఏకంగా ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగి పరిస్థితులను చక్కబెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. సాధారణ దాడులు చాలా వరకు పెరిగాయి. గొడవలు, ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతోనే శారీరక నేరాలు భారీగా పెరుగుతూ వచ్చాయి.
స్తంభించిన టెక్నాలజీ..!
పోలీసులు ఉపయోగిస్తున్న యాప్‌లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. దీంతో కొన్నాళ్లు కొన్ని యాప్‌లు పనిచేయలేదు. అత్యవసరమైనవి కూడా పనిచేయకపోవడంతో క్షేత్ర స్థాయిలో ప్రజలకు సేవలందించే పోలీసులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డయల్ 100 వంటి సేవలు వేగంగా అందించేందుకు ఈ టెక్నాలజీనే ఉపయోగిస్తుంటారు. కొంత టెక్నాలజీ స్థంభించడంతో ఇలాంటి సేవలు ఆలస్యంగా జరిగాయి. పెట్రోలింగ్ వ్యవస్థను మానిటరింగ్ చేస్తే వ్యవస్థ కూడా గాడి తప్పింది. పెట్రోలింగ్ వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో అన్ని రకాలుగా నేరగాళ్లకు కలిసి వచ్చింది. దీంతో ఈ సమయం కలిసి నేరగాళ్లు రెచ్చిపోయి నేరాలకు పాల్పడ్డారు. కొందరు దాడులు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేసే పరిస్థితికి వెళ్లిందని కొందరు అధికారులు చర్చించుకున్నారు. హైదరాబాద్‌లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే గత ప్రభుత్వం చేపట్టిన సాంకేతికపరమైన సంస్కరణలు పక్కాగా కొనసాగిస్తేనే నేరాలు అదుపులో ఉంటాయని కొందరు అధికారులు సూచిస్తున్నారు. గత రెండేండ్లలో నమోదైన బాడిలీ అఫెన్సెస్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి
సంవత్సరం : నేరాల సంఖ్య
2023 : 5,098
2024 : 8,447