బంజారాహిల్స్, జనవరి 17 : డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు నడిపిస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేసిన మైనర్‌తో పాటు అతడికి కారు ఇచ్చిన తండ్రిపై కూడా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎర్రగడ్డకు చెందిన బంజరంగ్ అగర్వాల్ కొడుకు (17) మూడురోజుల క్రితం మెహదీపట్నం నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నం 51వైపునకు కారులో అతివేగంగా వెళ్తూ జీహెచ్ఎంసీ డంప్ యార్డ్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టాడు. పెట్రోలింగ్ పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టగా కారు నడిపిన అబ్బాయికి లైసెన్స్ లేదని తేలింది. కారు అతడి తండ్రి భజరంగ్ అగర్వాల్ పేరుతో ఉంది. దీంతో ర్యాష్ డ్రైవింగ్ చేసిన కొడుకుతో పాటు తండ్రిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు
బ్యాడ్ డ్రైవర్స్ ఆఫ్ హైదరాబాద్..
నగరంలోని పలు ప్రాంతాల్లో అతివేగంగా ఖరీదైన కార్లను నడిపిస్తున్న దృశ్యాలను బ్యాడ్ డ్రైవర్స్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్స్‌లో పోస్ట్ చేస్తున్నారు. దీనిపై దృష్టి పెట్టిన ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ కానిస్టేబుల్ తిప్పాజీ ఈ అకౌంట్లోని వీడియోలను పరిశీలించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 45 నుంచి చెక్‌పోస్ట్ వైపునకు ఓ కారు మితిమీరిన వేగంతో వెళ్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. బుధవారం కారును సీజ్ చేసి కారు నడిపిస్తున్న కొవ్వూరి సాయి రెడ్డిని అదుపులోకి తీసుకుని నోటీసులు జారీ చేశారు. మరోఘటనలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి కేబీఆర్ పార్కు వైపునకు జిగ్‌జాగ్ డ్రైవింగ్‌తో వెళ్తున్న కారును గుర్తించి కానిస్టేబుల్ తిప్పాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కారు బంజారాహిల్స్ రోడ్ నం 7లోని రిచ్మౌంట్ వెంచర్స్ సంస్థ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్‌గా ఉన్న మ్యాడమ్ కార్తికేయ పేరుతో ఉన్నట్లు తేలింది. కాగా ట్విట్టర్‌లోని వీడియో 2నెలల క్రితం తీసిందని, కారును తానే నడిపానని ఏడుకొండలు అనే డ్రైవర్ బుధవారం పోలీసుల వద్దకు వచ్చాడు. అయితే కారు నడిపింది ఎవరు అనే దానిపై పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు.