శేరిలింగంపల్లి, నవంబర్ 3: మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై బైక్ విన్యాసాలు చేస్తూ.. వచ్చి ఐటీసీ కోహినూర్ వద్ద రహదారిపై పటాకులు కాల్చి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి హల్చల్ చేసిన ఓ యువకుడిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోను సైబరాబాద్ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు.
వాహనాలతో రద్దీగా ఉండే కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదకర స్థాయిలో బైక్ విన్యాసాలు చేయడంతో పాటు పక్కనే ఉన్న ఐటీసీ కోహినూర్ వద్ద రోడ్డుపై ప్రమాదకర స్థాయిలో బాణాసంచా కాల్చి.. విన్యాసాలు చేసి సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న రాయదుర్గం పోలీసులు సదరు యువకుడిపై కేసు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఘట్కేసర్ ప్రాంతానికి చెందిన యువకుడు ఆ వీడియోను పోస్టుచేసినట్లు గుర్తించారు. సదరు బైక్కు నంబర్ లేకపోవడంతో నిందితుడి కచ్చితమైన ఆచూకీ లభ్యం కాలేదని రాయదుర్గం సీఐ వెంకన్న తెలిపారు. సదరు యువకుడిపై బీఎన్ఎస్ఎస్ 121 సెక్షన్ కింద ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.