Chemistry Lecturer | మియాపూర్: సీనియర్ ఇంటర్ విద్యార్థినితో ఓ అధ్యాపకుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మదీనాగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో కెమెస్ట్రి అధ్యాపకుడిగా పని చేస్తున్న హరీశ్ సీనియర్ ఇంటర్ విద్యార్థిని పట్ల కొద్ది కాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమె ఫోన్ నంబర్ తీసుకుని అసభ్యకరమైన మెసేజ్లను పంపుతున్నాడు. అతడి ప్రవర్తనతో విసుగు చెందిన బాధితురాలు తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపింది.
వారు కళాశాలకు చేరుకుని అధ్యాపకుడు హరీశ్ చేష్టలపై కళాశాల ప్రిన్సిపాల్ ఇతర సిబ్బందిని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కళాశాలకు చేరుకొని అధ్యాపకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగాయి. ఎస్ఐ వెంకట్ కళాశాలకు చేరుకుని విద్యార్థినిలు, విద్యార్థి సంఘం ప్రతినిధులతో మాట్లాడి వివరాలను నమోదు చేసుకున్నారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సదరు అధ్యాపకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకట్ తెలిపారు. సదరు అధ్యాపకుడి అసభ్య ప్రవర్తన నిర్ధరణ కావడంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు కళాశాల ప్రతినిధి నాగరాజు పేర్కొన్నారు.