
ర్యాలీని ప్రారంభించిన కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్
మెహిదీపట్నం, డిసెంబర్ 11 : అందరికీ ఆరోగ్యం పేరుతో నిర్వహించిన ఆజాదీ కా అమృతోత్సవ్ శనివారం ముగిసింది. నవంబర్ 16న ప్రారంభం అయిన ఈ కార్యక్రమంలో కార్వాన్ నియోజకవర్గంలోని పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానల్లో ప్రతి రోజూ కార్యక్రమాలను నిర్వహించారు. ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా ప్రతి రోజూ పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానల్లో రోగులకు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. గర్భిణులకు పౌష్టికాహారం విశిష్టత వివరించి, ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ ప్రాధాన్యతను చెప్పారు. డిసెంబర్ 11 (శనివారం) గోల్కొండ కోటలో ముగింపు కార్యక్రమం జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అంతకు ముందు రెండు బృందాలుగా వైద్య సిబ్బంది విడిపోయారు. ఒక బృందం గోల్కొండ నుంచి, మరో బృందం కార్వాన్ నుంచి ర్యాలీగా గోల్కొండ ఫతేదర్వాజ వద్దకు చేరుకున్నాయి. రెండు బృందాలు గోల్కొండ కోటకు చేరుకున్నాయి. కార్యక్రమంలో హైదరాబాద్ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటి, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ అనూరాధ 5 పీహెచ్‌సీలు, 13 బస్తీ దవాఖానల డాక్టర్లు ,సిబ్బంది పాల్గొన్నారు.
అందరికీ వ్యాక్సిన్ అందించాలి
కరోనాను కట్టడి చేయడానికి జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖల అధికారులు కృషి చేయాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్ అన్నారు. శనివారం గోల్కొండ ఏరియా దవాఖానలో ఆజాదీ కా అమృతోత్సవ్ ర్యాలీని ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్, కార్పొరేటర్ స్వామియాదవ్, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ అనూరాధ, ఎంఐఎం కార్పొరేటర్ల ప్రతినిధులు బద్రుద్దీన్, మహ్మద్ హరూన్ ఫర్హాన్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కొవిడ్ నివారణకు వంద శాతం వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా కార్వాన్లో ఆజాదీ కా అమృతోత్సవ్ ర్యాలీని ప్రారంభించిన హైదరాబాద్ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటి సిబ్బందికి ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలను వివరించి వాటిని ప్రజలకు అందించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.