సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ) : ఓ వైపు ఇంధన ధరల మోత.. మరోవైపు నెలకు రావాల్సిన అద్దె కిరాయి రాక అద్దె కార్ల ఓనర్లు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ అధికారుల రాకపోకలు సజావుగా సాగేలా శ్రమిస్తున్న వారికి కష్టాలు వెంటాడుతున్నాయి. నెలనెల రావాల్సిన బిల్లులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహన యజమానులు బండ్లు నడపడానికి అప్పులు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా అద్దె ధరలు ఇప్పటికీ 2500ల కిలో మీటర్ల లెక్కన రూ.33వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ఇది 9 ఏండ్ల క్రితం నుంచి కొనసాగుతుంది.
అప్పుడు లీటర్ డీజిల్ ధర రూ.58 ఉండేది. కానీ ఇప్పుడు లీటర్ డీజిల్ ధర రూ.104 దాటింది. అయినా ఆనాటి అద్దెనే ఇప్పటికీ అమలులో ఉంది. ప్రభుత్వం నెలకు అందించే 33వేలలోనే డీజిల్ ఖర్చు, డ్రైవర్ వేతనం, కారు మెయింటెనెన్స్ అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. కాగా, అద్దె కార్ల ఓనర్ల కష్టాలు పట్టించుకోకపోతే ఉద్యమిస్తామని తెలంగాణ ఫోర్ వీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రభుత్వం రెండేళ్లుగా అద్దెలు చెల్లించడం లేదని వాపోయారు.
పంచాయతీరాజ్, వాటర్ వర్క్స్, కమర్షియల్ ట్యాక్స్ తదితర ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ అద్దె కార్లవినియోగం అధికంగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికీ అద్దె బకాయిలు విడుదల చేయకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా ఉందని వివరించారు. ప్రభుత్వం ఎప్పుడు బిల్లులు చెల్లిస్తే అప్పుడు ఆ డబ్బులను అప్పులకే చెల్లించాల్సి వస్తుందని వాపోయారు. ఈ సమస్యపై డిప్యూటీ మినిస్టర్, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా తమకు బకాయిలు చెల్లించి అద్దె ధరలను కూడా పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.