GHMC | సిటీబ్యూరో: గ్రేటర్లో వాహనాల కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. కార్ల షోరూంలు, ఇతర వాహనాల షోరూంలు సందడి లేక కళతప్పాయి. రాష్ట్రంలోనే అత్యధిక వాహనాలు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ఏడాదిన్నరగా వాహనాల కొనుగోళ్లలో దూకుడు తగ్గింది. 2023లో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డిలో 1,18,322 కార్లు విక్రయించగా.. 2024లో ఆ కార్ల అమ్మకాలు 12 శాతం తగ్గాయని రవాణా శాఖాధికారులు, వాహన షోరూం నిర్వాహకులు తెలిపారు.
కేసీఆర్ పాలనలో వాహనాల రిజిస్ట్రేషన్లలోనూ గ్రేటర్ హైదరాబాద్ పురోగతి చూపించింది. 2022లో 1,14,432 కార్లు విక్రయించగా.. 2023లో 1,18,322 అమ్ముడుపోయాయి. 2024లో మాత్రం ఆ సంఖ్య తగ్గుముఖం పట్టింది. 12 శాతం రిజిస్ట్రేషన్లు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన వాహనాల కొనుగోళ్లు తగ్గడంతో రవాణా శాఖకు ప్రతి ఏడాది వచ్చే ఆదాయం తగ్గే అవకాశముందని తెలిపారు. కేసీఆర్ పాలనలో ఇచ్చిన టార్గెట్‌కు అదనంగా డబ్బులు సమకూర్చిన రవాణా శాఖ.. ఈసారి ఆర్థిక సంవత్సర ముగింపు సమీపిస్తున్నా టార్గెట్ చేరుకోలేదని అధికారులు చెబుతున్నారు.
నగరంలో రియల్ ఎస్టేట్ తగ్గుముఖం పట్టడం.. వ్యాపారాలు సజావుగా సాగకపోవడం, హైడ్రా దుందుడుకుడు చర్యలతో నగర శివార్లలో నిర్మాణ రంగం కుంటుపడటం, జాతీయ, అంతర్జాతీయంగా హైదరాబాద్ ఐటీ కంపెనీలు తరలిపోవడం వంటి కారణాలతో గ్రేటర్లో ఒక అనిశ్చితి వాతావరణం ఏర్పడింది. కేసీఆర్ పాలనలో భూములకు ధరలు ఉండటం, కంపెనీల ఏర్పాటు, స్టార్టప్ ఐడియాలకు ప్రోత్సాహం, వీ హబ్ వంటి వినూత్న కార్యక్రరమాలతో మహిళలను సైతం వ్యాపారధిపతులుగా తయారు చేయడం లాంటివి జరిగాయి. దీంతో వాళ్లందరూ అనేక కంపెనీలు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ క్రమంలో వాళ్లంతా ఆర్థికంగా బలపడ్డారు. ఈ మార్పు కార్ల షోరూంలకు కలిసొచ్చేది. కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించేవారు. కానీ ఆ సందడి వాహన షోరూంలో ఇప్పుడు కరువైంది.