ఖైరతాబాద్, మే 12 : నిమ్స్ దవాఖానలో మొక్కుబడిగా తెర్చుకున్న ఇందిరమ్మ క్యాంటిన్ మళ్లీ మూతపడింది. ప్రైవేట్ క్యాంటిన్ల కోసం దీనిని మూసివేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దవాఖానకు వచ్చే పేద రోగులు, వారి సహాయకుల కోసం గత ప్రభుత్వ హయాంలో జీహెచ్ఎంసీ ద్వారా అన్నపూర్ణ పథకాన్ని ప్రారంభించి రూ.5లకే నాణ్యమైన భోజనాన్ని అందించే వారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం పేదల కోసం ఇందిరమ్మ క్యాంటిన్ ద్వారా నాణ్యమైన టిఫిన్లు, భోజనాలు అందిస్తామని ప్రచారం చేసింది. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఇందిరమ్మ క్యాంటిన్లను సైతం అట్టహాసంగా ఏర్పాటు చేసింది. నిమ్స్ దవాఖానలో పంజాగుట్ట గేటు వద్ద ఫెస్సీ కియోస్క్ కేఫ్ ముందు ఏర్పాటు చేశారు. అయితే అది మూణ్నాళ్ల ముచ్చగానే మరింది. మొదటి నాలుగు నెలలు క్యాంటిన్ తెర్చుకోలేదు. యాజమాన్యం సైతం పట్టించుకోవడం మానివేయడంతో దీనిపై తీవ్ర విమర్శలు రాగా, మొక్కుబడిగా తెరిచారు. కాలక్రమేణా మళ్లీ పట్టించుకోవడం మానేశారు. దీంతో మళ్లీ క్యాంటిన్ మూతపడింది.
రేట్లు అధికం.. నాణ్యత కరువు
నిమ్స్ దవాఖానలో పలు స్వచ్ఛంద సంస్థలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో రోగులు, వారి సహాయకుల కోసం ఆహారాన్ని అందించేవి. దానికి తోడు మధ్యాహ్నం వేళ అన్నపూర్ణ క్యాంటిన్ ఆకలి తీర్చేది. అయితే యాజమాన్యం స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న ఆహారాన్ని నిషేధించడంతో తిండి కోసం ప్రైవేట్ క్యాంటిన్లే దిక్కు అయ్యాయని అంటున్నారు. నిమ్స్ వచ్చే వారి ఆకలిని ఆసరా చేసుకొని ప్రస్తుతం ఉన్న ఫెస్సీ కియోస్క్ కేఫ్, మెయిన్ క్యాంటిన్లో ఆహార పదార్థాల రేట్లు ఇష్టారాజ్యంగా పెంచేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా ఆహారంలో సైతం నాణ్యత కొరవడిందంటున్నారు. ఆరోగ్యశ్రీ లాంటి పథకాల్లో ఉచితంగా చికిత్స కోసం వస్తున్నామని, కాని తిండి తినాలంటే మాత్రం వందలాది రూపాయలు వెచ్చించుకోవాల్సి వస్తోందని రోగులు, వారి సహాయకులు వాపోతున్నారు. ఇందిరమ్మ క్యాంటిన్ తెరిచి ఉన్నట్లయితే తమకు ఆర్థిక భారం తగ్గేదని, నిమ్స్‌లోని నాణ్యత లేని ఆహారం తిని కొత్త రోగాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా క్యాంటిన్లలో అపరిశుభ్ర వాతావరణం నెలకొందని, విధి లేని పరిస్థితుల్లో తినాల్సి వస్తోందంటున్నారు. యాజమాన్యం, ప్రభుత్వం స్పందించి ఇందిరమ్మ క్యాంటిన్‌ను తెరిపించి తమ జేబులు ఖాళీ కాకుండా చూడాలని కోరుతున్నారు.