Ganja Chocolates | సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 ( నమస్తే తెలంగాణ ) : తల్లిదండ్రులు జరభద్రం.. మీ పిల్లలు సేఫ్‌గానే ఉన్నారా? వారి ప్రవర్తనలో ఏవైన మార్పులు గమనిస్తున్నారా? ఆందోళనకర మార్పులు కనిపిస్తే పారాహుషార్. నగరంలో డ్రగ్స్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. డబ్బును బట్టి గంజాయి నుంచి అత్యధిక విలువచేసే డ్రగ్స్ వరకు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల గంజాయితో కూడిన చాక్లెట్లను పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇలాంటి ప్రమాదకర చాక్లెట్లు దుఖాణాల్లో, పాఠశాలలు, కాలేజీల సమీపంలో సైతం విక్రయిస్తున్నారు. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వారికి అలవాటు చేస్తున్నారు.
ఇది క్రమక్రమంగా విద్యార్థుల మెదడుపై దుష్ప్రప్రభావం చూపి అనారోగ్యానికి గురిచేస్తుంది. ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలతో సన్నిహితంగా ఉంటే తప్ప వారిని ఈ మత్తు ప్రపంచంలోకి వెళ్లకుండా అడ్డుకోలేం. హైదరాబాద్ కేంద్రంగా శివారు ప్రాంతాల్లో పాఠశాలలు, కాలేజీలు, ఐటీ సెక్టార్లే లక్ష్యంగా పదుల సంఖ్యలో మత్తు ముఠాలు పనిచేస్తున్నాయి. తొలుత ఉచితంగా ఇచ్చి విద్యార్థులను ఉచ్చులో దించుతున్నారు. తర్వాత వారినే మత్తు మందులు అమ్మే వ్యాపారులగా సైతం మారుస్తున్నారు. చాలా మంది ఒక్క ప్రయోగాత్మకంగానే తొలుత మత్తుపదార్థాలను తీసుకుంటారు. స్నేహితులు తీసుకుంటున్నారు కదా అని తాము కూడా తీసుకోవాలని భావిస్తుంటారు. సరదాగా మొదలైంది కాస్త అడిక్షన్ కింద మారుతుంది.
పేరెంట్స్ జరభద్రం..
పేరెంట్స్ తమ పిల్లలతో నిజాయతీగా కమ్యూనికేషన్ ఉండాలి. పిల్లలు ఏదైతే తప్పు చేస్తారో దానిని సరిచేయాలి. తల్లిదండ్రుల ప్రేమ గొప్పదిగా పిల్లలు అనుభూతి చెందాలి. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. ఒక అసాధారణ ప్రవర్తన తెలియాలంటే మొదట వారి సాధారణ ప్రవర్తన తెలియాలి. పిల్లలతో మాట్లాడటం అతి ముఖ్యం. ఏదైన బిహేవియర్లో తేడా కనిపిస్తే గుర్తించడం సులభమవుతుంది. మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించాలి. బాధితులు ఉంటే వారికి అన్ని రకాల సపోర్ట్ ఇచ్చి సాధ్యమైనంత వరకు వారిని అందులో నుంచి బయటకు తీసుకురావాలి.
పోలీసు విభాగాల నిఘా లోపం..
ఆబ్కారీ, పోలీసు విభాగాల నిఘా లోపం, నిర్లక్ష్యం కారణంగా మహానగరంలో గంజాయి చాక్లెట్ల విక్రయం యధేచ్ఛగా జరుగుతున్నది. ఒడిశా కేంద్రంగా సాగుతున్న ఈ గంజాయి చాక్లెట్లకు విద్యార్థులతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, కార్మికులతో పాటు వివిధ వర్గాల వారు బానిసగా మారారు. అంతే కాకుండా తొలుత మత్తుకు అలవాటైన బాధితులు.. ఆ తరువాత ఆ మత్తు పదార్థాల విక్రయాలనే వ్యాపారంగా మలుచుకుని చివరికి నేరస్తులుగా మారుతున్నట్లు ఇటీవల పట్టుబడిన పలు కేసుల్లో నిందితులు వెల్లడించడం గమనార్హం. గతేడాది కొత్తూరు ఠాణా పక్కన గల కిరాణాషాపులో స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యవహారంపై సదరు పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేసేంత వరకు పోలీసులకు గాని, ఆబ్కారీ అధికారులకు గాని సమాచారం లేకపోవడం గమనార్హం. ఆ తరువాత నార్సింగి పరధిలో, తాజాగా కూకట్‌పల్లిలో గంజాయి చాక్లెట్ల విక్రయాలు బయటపడ్డాయి.
చెడు మార్గాలకు వెళ్లకుండా చూడాలి
పిల్లలు, తల్లిదండ్రల మధ్య బంధం బలంగా ఉంటేనే చెడు మార్గాలకు పిల్లలు వెళ్లకుండా చూడటం సాధ్యమవుతుంది. పిల్లలను సన్నిహితంగా గమనిస్తే వారిని మనం కాపాడుకోగలం. వృత్తిరీత్యా చాలా మంది పిల్లలతో సమయం వెచ్చించరు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. పేరెంట్స్ ఎంత క్లోజ్‌గా పిల్లలతో ఉంటే అంతలా పిల్లలు సన్మార్గంలో నడుస్తుంటారు.
-జీసీ. కవిత, కౌన్సెలింగ్ సైకాలజిస్టు, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్.