పింఛన్లు పెంచుతామని ఆశపెట్టారు.. ఉద్యోగ నియామకాల్లో 4శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రగల్భాలు పలికారు.. స్థానిక సంస్థల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయిస్తామని నమ్మబలికారు.. ప్రత్యేక కార్పొరేషన్ కేటాయిస్తామని ఊదరగొట్టారు.. ఆత్మగౌరవంతో బతికేలా చేస్తామని నోటికొచ్చిన హామీలిచ్చి దగా చేసిన కాంగ్రెస్‌పై దివ్యాంగులు భగ్గుమన్నారు. నమ్మకద్రోహం చేసిన కాంగ్రెస్‌కు సర్కారుకు బుద్ధి చెప్పేందుకు మంగళవారం కృష్ణకాంత్ పార్కు నుంచి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ తీశారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌ను జూబ్లీహిల్స్‌లో ఓడించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఓటర్లను కోరారు. కాంగ్రెస్‌ను ఓడించి రేవంత్‌రెడ్డికి జ్ఞానోదయం కలిగిస్తామని తేల్చి చెప్పారు.
సిటీబ్యూరో, నవంబర్ 4(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసింది. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో నమ్మక ద్రోహం చేసింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రగల్భాలు పలికి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అందులో భాగంగానే అధికారంలోకి రాగానే దివ్యాంగుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని ఆత్మగౌరవంగా బతికేలా అన్ని వసతులు కల్పిస్తామని నమ్మబిలికారు. కేసీఆర్ ఇస్తున్న సంక్షేమ పథకాల కంటే రెట్టింపు అమలు చేస్తామని చెప్పడంతో అమాయక దివ్యాంగులు రేవంత్‌రెడ్డి మాటలను గుడ్డిగా నమ్మారు. తమ బతుకులు మరింత మెరుగవుతాయని ఆశపడ్డారు. కానీ రేవంత్‌రెడ్డి సీఎం అయిన నాటి నుంచి వారి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. రెండేండ్లుగా వాళ్లకిచ్చిన హామీలను అమలు చేయాలని ఎన్నోసార్లు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపినా పట్టించుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న రూ.4వేల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచుతామని ప్రకటించారు. ఈ నెల పింఛన్ రూ.4వేలే తీసుకున్నరు. వచ్చే నెల నుంచి రూ.6 వేలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి గప్పాలు కొట్టారు. ఉద్యోగాల నియామకాల్లో దివ్యాంగులకు 4శాతం వాటా ఇస్తామని మోసపూరిత హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. కానీ ఏ ఒక్క హామీ అమలు చేయకపోవడంతో ఆగ్రహంతో ఉన్న దివ్యాంగులు మంగళవారం సర్కారుపై కదంతొక్కారు.
దివ్యాంగులను సీఎం రేవంత్‌రెడ్డి నమ్మించి మోసం చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ఒక్క హామీ అమలు చేయకుండా ద్రోహం చేశారు. హామీలు అమలు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో పాటు అధికారులందరికీ విన్నవించినా పట్టించుకోవడం లేదు. అన్ని వర్గాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ దివ్యాంగులకు చేసిన మోసాలను ప్రజలందరికీ తెలియజేస్తాం. కాంగ్రెస్ ఓడిపోతేనే హామీలు అమలు చేస్తారు. అందుకే ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడించి బుద్ధి చెప్పాలని జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతున్నాం.
– భాగ్యమ్మ, అధ్యక్షురాలు, సహకార్ దివ్యాంగుల సంఘం
నిరుద్యోగిగా ఉన్న రేవంత్‌రెడ్డికి ఓటేసి ఉద్యోగిని చేశాం. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలు నెరవేర్చని సీఎం రేవత్‌రెడ్డిని మళ్లీ అదే ఓటుతో మరోసారి నిరుద్యోగిగా మారుస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దివ్యాంగులకు ఉద్యోగాల్లో 4శాతం కేటాయిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. అసలు ఉద్యోగాలే ఇవ్వకుండా నమ్మక ద్రోహం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం దివ్యాంగులు ఆత్మగౌరవంగా బతకాలని పింఛన్ రూ.4వేలిచ్చి ఆదుకున్నది. కాంగ్రెస్‌కు ఓటేస్తే పింఛన్ రూ.6వేలు చేస్తామని రేవంత్‌రెడ్డి నమ్మబలికి ఆగం చేశారు. రేవంత్ చేసిన అన్యాయానికి జూబ్లీహిల్స్‌లో ఓడించాలి. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పి జూబ్లీహిల్స్ ప్రజలు మద్దతుగా ఉండాలని కోరుతున్నాం.
– జీ మల్లేశ్, నిరుద్యోగ యువజన దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు
రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్‌రెడ్డికి జూబ్లీహిల్స్ ఓటమితో జ్ఞానోదయం కలగాలి. ఈ ఉప ఎన్నికలో ఆయన మాటలు నమ్మి మోసపోయినవారి సత్తా ఏమిటో తెలియాజేయాలి. ఈ ఎన్నిక ఫలితాలతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుంది. జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించాలి. మీ ఓటు రాష్ట్ర భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. కాంగ్రెస్ పాలనలో దివ్యాంగులు రెండేండ్లుగా అవస్థలు పడుతున్నారు. తమకిచ్చిన హామీలు అమలు చేయాలని అధికారులు, నాయకుల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా వారికి న్యాయం జరగాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాల్సిందే.
– మహేశ్, బీఆర్ఎస్ నేత