శేరిలింగంపల్లి, జూన్ 18: పని ఒత్తిడి తట్టుకోలేక జీవితంపై విరక్తి చెందిన ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం, వాడి గ్రామానికి చెందిన నిర్మల సురేశ్‌రెడ్డి (28) బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి మణికొండలోని అన్న అజయ్ ఇంట్లో ఉంటున్నాడు. మణికొండలోని ఓ ప్రైవేట్ కంపెనీ సంస్థలో చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 16న ఇంటిని నుంచి వెళ్లిన సురేశ్‌రెడ్డి చెల్లెలు ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి.. బయటకు వెళ్లాడు.
ఇంటి నుంచి వెళ్లిన సురేశ్ రెడ్డి కొండాపుర్ రాజరాజశ్వేరి కాలనీలో ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్స్‌లో మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం గదిని శుభ్రం చేసేందుకు వాచ్మెన్ ఎంత తలుపు తట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా, సురేశ్‌రెడ్డి తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని హీలియం గ్యాస్ పీల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గచ్చిబౌలి పోలీసులు గుర్తించారు. సురేశ్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న గదిలో హీలియం గ్యాస్ సిలిండర్‌తో పాటు సుసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పని ఒత్తిడి తట్టుకోలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.