సిటీబ్యూరో/జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): స్టాక్ మార్కెట్లో ఎక్కువ లాభాలు సంపాదించ వచ్చని.. మేం చెప్పే గైడెన్స్‌ను అనుసరించి.. టిప్స్ ఫాలో అవుతే చాలు.. మీరు అనుకున్న లాభాలు ఇట్టే వచ్చేస్తాయంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలతో చాలా మంది బోల్తా పడుతున్నారు. టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఫ్రీ స్టాక్ మార్కెట్ టిప్స్ అంటూ ప్రకటిస్తుంటారు. అలాంటి ప్రకటనలు చూసి ఆకర్షితులయ్యే వారిని సైబర్‌నేరగాళ్లు ఈజీగా బుట్టలో వేసుకుంటున్నారు. ముందుగా బాధితులు పెట్టే తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలొచ్చాయంటూ స్వయంగా సైబర్నేరగాళ్లే తమ సొంత డబ్బును బాధితుల ఖాతాల్లో డిపాజిట్ చేస్తారు. మేము ట్రేడింగ్‌లో చెప్పిన టిప్స్ అనుసరించడం వల్లే మీకు భారీగా లాభాలొస్తున్నాయంటూ నమ్మిస్తుంటారు. ఆ తరువాత మీకు ప్రీమియం, వీఐపీ గ్రూప్‌లు ఉంటాయి.. మీరు అందులో చేరితో స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన మార్కెట్ అప్డేట్ ఎప్పటికప్పుడు ఉంటుందని, అధిక లాభాలు వచ్చే విధంగా ఉంటుందంటూ నమ్మిస్తుంటారు. ఒక వెబ్సైట్, యాప్‌లలో స్క్రీన్‌పై అధిక లాభాలు వస్తున్నట్లు చూపిస్తూ.. బాధితుల్లో మరింత ఆశ పుట్టిస్తూ పెట్టుబడులు పెట్టిస్తుంటారు. కొంతపెట్టుబడి పెట్టిన తరువాత మీకు లాభాలొచ్చాయంటూ నమ్మిస్తూ వాటిని డ్రా చేసుకోవడానికి పన్ను చెల్లించాలని చెబుతారు. ఆ తరువాత మీ ఖాతా బ్లాక్ అయ్యిందని, ఆ తరువాత మరో స్టెప్ ముందుకేస్తే ఇంకా లాభాలొస్తాయని.. రకరకాల కారణాలు చూపిస్తూ నిండుగా ముంచేస్తారు.
ఎక్కువగా చార్టెడ్ అకౌంట్స్, న్యాయవాదులే సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కుతున్నారు. ఇటీవల ఒక అడ్వకేట్ ఫేస్బుక్లో ఒక ప్రకటన చూశాడు. ఆ ప్రకటన చూసి ఆయన వారు చెప్పినట్లు చేశాడు. నకిలీ వెబ్సైట్లోకి వెళ్లి సైబర్‌నేరగాళ్లు చెప్పినట్లు చేస్తూ రూ. 85 లక్షలు పోగొట్టుకున్నాడు. మరో ఘటనలో చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కి రూ.91 లక్షలు పోగొట్టుకున్నాడు.
సోషల్‌మీడియాలో గుర్తుతెలియని వ్యక్తులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో కొత్త అప్లికేషన్లను వాడొద్దు. సెబీ వద్ద రిజిస్ట్రేషన్ అయిన అప్లికేషన్లను మాత్రమే ఉపయోగించాలి. వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు బదిలీ చేయవద్దు. డీమార్ట్ ఖాతా వివరాలు గుర్తుతెలియని వ్యక్తులకు షేర్ చేయవద్దు. సోషల్‌మీడియా గ్రూప్‌లలో మేం బాగా సంపాదించాం.. ట్రేడింగ్‌లో భారీగా లాభాలు వచ్చాయంటూ గ్రూపులో చర్చించుకునే వారి మాటలను అసలు పట్టించుకోవద్దు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి వచ్చే యాప్‌లను డౌన్లోడ్ చేసుకొని, అత్యాశకు పోయి అప్పుల పాలు కావద్దు.